మాజీ టీడీపీ నేతలు తిరిగి టీడీపీలోకి దూకేయనున్నారా.?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన వ్యవహారం కాదిది. తెలంగాణలో ఒకప్పటి టీడీపీ నేతలు తిరిగి సొంత గూటికి వెళ్ళే ఆలోచనలో వున్నారట. ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితిగా మారిన నిన్నటి తెలంగాణ రాష్ట్ర సమితిలో చాలామంది నేతలు టీడీపీ నుంచి వచ్చినవారే.

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ కూడా ఒకప్పటి టీడీపీ నేత. తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా చాలామంది మాజీ టీడీపీ నేతలు, ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితిలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు.

తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కేసీయార్, తెలంగాణ రాష్ట్ర సమితి పేరుని భారత్ రాష్ట్ర సమితిగా మార్చాక.. రాజకీయం మరింత అనూహ్యంగా మారింది. తెలంగాణ ఉనికి కోల్పోయిందన్న వాదన తెరపైకొస్తోంది.

తెలంగాణ అంటే కేసీయార్.. కేసీయార్ అంటే తెలంగాణ.. అనేది ఒకప్పటి పరిస్థితి. కానీ, ఇప్పుడు సీన్ మారింది. ఈ నేపథ్యంలో ఒకరొకరుగా మాజీ టీడీపీ నేతలు తిరిగి తమ పాత జ్ఞాపకాల్ని, తమ పాత ఇమేజ్‌నీ గుర్తు చేసుకుంటున్నారట.

అయితే, టీడీపీని ఒకవేళ నమ్మితో ‘డాష్ తోక పట్టుకుని గోదారి ఈదినట్లుంటుందేమో..’ అన్న భావన చాలామందిలో వుంది. బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుండడంతో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏమవుతుందోనన్న ఆందోళనలో వున్న మాజీ టీడీపీ నేతలు, టీడీపీని ప్రత్యామ్నాయంగా భావించడంలో వింతేమీ లేదు.

కానీ, చంద్రబాబుతో రాజకీయం ఎలా వుంటుందో ఆల్రెడీ అనుభవమున్న మాజీ టీడీపీ నేతలు, కొంత తటపటాయిస్తున్నారట.