టీఆర్ఎస్, కేసీఆర్ తో తెగతెంపులు అయ్యాక ఈటల రాజేందర్ చుట్టూనే తెలంగాణ రాజకీయం మొత్తం తిరుగుతుంది. అసైన్డ్ భూముల విషయంలో ఈటల అక్రమాలకు పాల్పడ్డారంటూ కేసీఆర్ ఆయన్ని మంత్రి వర్గం నుంచి తొలిగించారు. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటన చేశారు. అడుగడుగునా ఆయనకు కార్యకర్తలు, మహిళలు హారతులు ఇచ్చి బ్రహ్మరథం పట్టారు.
ఈ పర్యటనలో భాగంగా కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ జిల్లా కేంద్ర బిందువని ఆయన వ్యాఖ్యానించారు. హుజురాబాద్ ప్రజలు సీఎం కేసిఆర్‌కు బుద్ది చెప్పెందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. నేడు హుజూరాబాద్ ఆత్మగౌరవ పోరాటానికి, అణగారిన వర్గాల హక్కుల కోసం చేసే ఉద్యమకోసం ఉద్యమ క్షేత్రంగా మారనుందని చెప్పారు.
ఆయనకు, టీఆర్ఎస్ కు మధ్య జరుగుతున్న పోరాటాన్ని మహాభారతంతో పోల్చారు ఈటల. త్వరలో శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజా ప్రతినిధులను డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో ధర్మానికి ,అధర్మానికి మధ్య సంగ్రామం జరగనుందని ఘాటుగా విమర్శించారాయన. రాబోవు ఎన్నికల్లో కేసీఆర్ కు బుద్దిచెబుతామని హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు చెప్పారని…ఎన్నికల్లో తన విజయానికి భరోసా ఇచ్చారని తెలిపారు. ఇక ఆయన అతి త్వరలో బీజేపీ పార్టీలో చేరనున్నట్లుగా సమాచారం.