బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్, సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిథులు (ఎమ్మెల్యేలతోపాటు ఎంపీలు కూడానట) తనతో టచ్లో వున్నారన్నది ఈటెల పేల్చిన తాజా బాంబు.
కొన్నాళ్ళ క్రితం ఈటెల రాజేందర్ని తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి బయటకు పంపేశారు గులాబీ బాస్ కేసీయార్. ఈటెల రాజేందర్ని తొలుత మంత్రి పదవి నుంచి పీకేసి, ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయేలా కేసీయార్ చేయగలిగారు.
కానీ, అదే ఈటెల రాజేందర్ చేతిలో హుజూరాబాద్ నియోజకవర్గంలో గులాబీ పార్టీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దాంతో, రాత్రికి రాత్రి ఈటెల రాజేందర్ ‘జెయింట్ కిల్లర్’ అవతారమెత్తారు. అయితే, బీజేపీలో ఆయనకు తగిన గౌరవం దక్కడంలేదంటూ గులాబీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తూ వస్తున్నాయి.
ఈటెల మాత్రం, తాను బీజేపీలో బేషుగ్గా వున్నానని అంటున్నారు. కాలం కలిసొస్తే, బీజేపీ నుంచే ముఖ్యమంత్రి అవుతాననే ధీమాతో వున్నారాయన. ఈ నేపథ్యంలో ఈటెల వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. బీజేపీలో తన పరపతి పెంచుకునే క్రమంలో గులాబీ పార్టీ నుంచి ప్రజా ప్రతినిథుల్ని ఈటెల తనవైపుకు తిప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.
అరడజను మంది ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు ఎంపీలతో ఈటెల టచ్లోకి వెళ్ళారట. అయితే, వాళ్ళే తనతో టచ్లోకి వచ్చారని చెబుతున్నారు ఈటెల రాజేందర్. నిజంగానే ఈటెల వాళ్ళని తనవైపుకు లాక్కురాగలిగితే, బీజేపీలో ఆయనకు పరపతి పెరుగుతుందనడంలో ఎలాంటి అనుమానాలూ లేవు.