తెలంగాణ మంత్రి హరీష్ రావు ఎన్నికల సంఘానికి అడ్డంగా దొరికి పోయారా? హరీష్ రావు మీద ఎన్నికల కమిషన్ కేసు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేసిందా? సిద్ధిపేటలో హరీష్ రావు ఏ విషయంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘించారు? ఒక మంత్రిగా ఉన్న హరీష్ రావు నిబంధనలు ఉల్లంఘించడం సమంజసమేనా? రాజకీయ వర్గాల్లో హరీష్ రావు పై కేసులకు రంగం సిద్ధం చేసినట్లు ఒక వార్త సంచలనం రేపుతున్నది. పూర్తి వివరాలు చదవండి.
ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో మంత్రి హరీష్ రావు మీద కేసులు నమోదు చేయాలని ఈసి నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రజాప్రాతినిథ్య చట్టంలోని 125 సెక్షన్ ప్రకారం హరీష్ రావు మీద చర్యలు తీసుకోబోతున్నట్లు ఎన్నికల సంఘం రాష్ట్ర సిఇఓ రజత్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు హరీష్ రావు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు ఈసి వర్గాల నుంచి సమాచారం అందింది.
ప్రజాప్రాతినిథ్య చట్టం లోని 125 నిబంధనల్లో.. ఏముందంటే? ఈ చట్టం ప్రకారం ఎన్నికలతో సంబంధం ఉన్న వర్గాల మధ్య శత్రుత్వాన్ని ఎవరూ ప్రోత్సహించకూడదు. మతం, జాతి, ప్రాంతం, సామాజికవర్గం, భాషా పరమైన భావాలను రెచ్చగొట్లేలా వ్యవహరించరాదు. పౌరులను విభజించేందుకు ఎవరు ప్రయత్నించినా వారు శిక్షకు అర్హులవుతారు. అందుకోసం మూడేళ్ల వరకు జైలు శిక్ష, లేదా జరిమానా విధించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో రెండు శిక్షలూ కలిపి అమలు చేయవచ్చు.
అయితే సిద్ధిపేటలో మంత్రి హరీష్ రావు ఆర్యవైశ్య సంఘం (కుల సంఘం) మీటింగ్ లో పాల్గొన్నారు. ఆ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. ఆర్యవైశ్య సంఘం నేతలు హరీష్ రావును ఈ సమావేశంలో ఘనమైన సన్మానం కూడా చేశారు. దీనిపై ఈసికి ఫిర్యాదు అందింది. దీంతో ఈసి ఈ ఘటనపై సమాచారం సేకరించింది. ఈ సమావేశానికి సంబంధించి సిడిలు, ఫొటోల ఆధారంగా చర్యలు తీసుకోవాలని సిద్ధిపేట డిఇఓ (డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్) కు ఎన్నికల సంఘం సిఇఓ రజత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా గతంలో ఎపి సిఎం చంద్రబాబును ఉద్దేశించి కూడా హరీష్ రావు వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఆ సమయంలోనూ ఈసి నోటీసులు జారీ చేసింది హరీష్ రావుకు.
ఆర్యవైశ్య సంఘం సమావేశంలో హరీష్ రావు పాల్గొనడాన్ని ఈసి సీరియస్ గా తీసుకుంది. ఈ విషయమై అన్ని కోణాల్లో సమాచారం సేకరించిన ఎన్నికల కమిషన్ హరీష్ రావు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సిద్ధిపేట కలెక్టర్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హరీష్ రావు సిద్ధిపేటలో నిబంధనలు ఉల్లంఘించినట్లు ఈసి స్పష్టం చేసింది.
అయితే హరీష్ రావు మీద ఏరకమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు? ఆ కేసుల తీవ్రత ఎలా ఉంటుందన్నదానిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. గురవారం రాత్రి వరకు హరీష్ రావు మీద ఏ ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారన్నదానిపై సమాచారం అందే అవకాశం ఉంది.
మంత్రులు కుల సంఘాల సమావేశాల్లో పాల్గొనరాదని పదే పదే ఎన్నికల సంఘం సూచిస్తున్నప్పటికీ హరీష్ రావు ఆర్యవైశ్య సంఘం సమావేశంలో పాల్గొనడం చర్చనీయాంశమైంది. మెదక్ జిల్లాలో పటాన్ చెరువు తాజా మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ అభ్యర్థి గూడెం మైపాల్ రెడ్డి కూడా కుల సంఘం సమావేశంలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఒక ఫంక్షన్ హాల్ లో ముదిరాజ్ కులస్తులు ఏర్పాటు చేసిన వన భోజనాల కార్యక్రమంలో మైపాల్ రెడ్డి పాల్గొన్నారు. దీనిపైనా ఫిర్యాదు అందడంతో ఆయనకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
మొత్తానికి మెద్ జిల్లాలోనే కోడ్ ఉల్లంఘన ఘటనలు జరగడం చర్చనీయాంశమైంది.