భారత్ రాష్ట్ర సమితికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన సిగ్నల్

కేంద్ర ఎన్నికల సంఘం భారత్ రాష్ట్ర సమితికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా మార్చుతూ ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

పార్టీ పరంగా నిర్ణయం తీసుకుని, సంబంధిత దరఖాస్తుని (పేరు మార్పు విషయమై) కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ రాష్ట్ర సమితి పంపింది. అనంతరం, 30 రోజుల్లోగా పేరుపై అభ్యంతరాలు ఏమైనా వుంటే తెలపాలంటూ పత్రికా ప్రకటన కూడా జారీ అయ్యింది.

ఆ ముప్ఫయ్ రోజుల గడువు కూడా పూర్తవడంతో, ఎలాంటి అభ్యంతరాలూ రాని కారణంగా, పేరు మార్పు పట్ల సానుకూలత వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయానికి సమాచారం పంపింది కేంద్ర ఎన్నికల సంఘం. పేరు మార్పుకి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనున్నట్లు ఈ లేఖలో పేర్కొంది కేంద్ర ఎన్నికల సంఘం.

కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో, ఆ నోటిఫికేషన్ తేదీ కోసం ఎదురుచూస్తోందిప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి. సదరు నోటిఫికేషన్ కూడా వచ్చేస్తే, ఆ తేదీ నుంచే తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా, భారత్ రాష్ట్ర సమితిగా చెలామణీలోకి వస్తుంది. నోటిఫికేషన్ వచ్చే రోజున బీఆర్ఎస్ జెండాని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ ఆవిష్కరించనున్నారు.