ఈడీ లాయర్ రాజీనామా… కవిత కేసులో ఏమి జరుగుతుంది?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. విచిత్రం ఏమిటంటే… మహా మహా మేధావులు, రాజకీయ పండితులు సైతం ఈ ట్విస్టులను ఏమాత్రం ఊహించలేకపోవడం!

విషయానికొస్తే… ఈడీ ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ నితీష్ రాణా రాజీనామా చేశారు! అవును… ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ నితీష్ రాణా రాజీనామా చేశారు. నిన్నటి వరకు నిందితులకు సూటి ప్రశ్నలు వేసిన ఈడీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌.. ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 2015 నుండి ఈడీకి స్పెష‌ల్ ప్రాసిక్యూట‌ర్ గా అంటూ.. అనేక కీల‌క కేసుల్లో ఈడీ త‌రుపున‌ ప్రాతినిధ్యం వ‌హించిన రాణా… వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో రాజీనామా చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం, కాంగ్రెస్ నేత డికె శివకుమార్, ఆర్ జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ, విజయ్‌ మాల్యా, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాలకు వ్యతిరేకంగా దాఖలై.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసుల్లో ఈడీ తరుపున రాణా వాదనలు వినిపించారు. ఆ స్థాయి చరిత్ర, అనుభవం ఉన్న రాణా… సడన్ గా కవిత కేసు విషయానికొచ్చే సరికి తప్పుకోవడం చర్చనీయాంశం అయ్యింది.

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో భాగంగా.. శనివారం ఎమ్మెల్సీ కవితను సైతం ఈడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మార్చి 16న మరోసారి కవితను విచారించనున్నారు ఈడీ అధికారులు. ఆ విచారణే దాదాపు ఫైనల్ అని ఊహాగాణాలు వెలువడుతున్న ఇలాంటి పరిస్థితుల్లో.. ఉన్నపలంగా నితేశ్ రాణా రాజీనామా చేయడం హాట్ టాఫిక్ గా మారింది.

కాగా… కవిత కి బినామీగా వాంగ్మూలం ఇచ్చారు అంటూ ఈడీ అధికారులు పేర్కొన్న అరుణ్ పిళ్లై… గతంలో తానిచ్చిన వాంగ్మూళాన్ని వెనక్కి తీసుకుంటానని న్యాయస్థానన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆ ట్విస్టు తర్వాత ఇది మరో భారీ ట్విస్ట్!!