కవితకు నోటీసులు… ఎవరేమన్నారంటే..!

మహిళలను గౌరవించుకోవాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రప్రభుత్వం గొప్పగా ఈ రోజు సెలవు ప్రకటించి.. మహిళా జర్నలిస్టుల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు పెడుతుంటే.. ప్రశ్నించాలనేవారిని గొంతునొక్కాలనే ఉద్దేశ్యంతో.. మహిళాదినోత్సవం రోజునే కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని దేశవ్యాప్తంగా మహిళలంతా గ్రహించాలి అని చెబుతున్నారు నిజామాబాద్ బీఆరెస్స్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా! చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ అంశంపై కవిత ఇనీషియేట్ తీసుకుని కేంద్రప్రభుత్వాన్ని అడుగుతుంటే.. ఆ గొంతు నొక్కడంలో భాగంగానే కవితకు నోటీసులు ఇచ్చారనేది ఆయన వెర్షన్!

మహిళా దినోత్సవం రోజున ఇలా ఒక మహిళకు నోటీసులు పంపించి, దేశంలోని మహిళలకు బీజేపీ ఏమి సందేశం ఇవ్వలనుకుంది? జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించిన తర్వాత.. ఈ రోజున ఇలాంటి నోటీసులు ఇవ్వడం కక్ష సాధింపు చర్య కాక మరేమిటి? కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యం తప్ప మరొకటి ఇందులో కనిపించడం లేదు! అనేది మరో బీఆరెస్స్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వాదన!

కవితకు నోటీసులు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు… ఈడీ నోటీసులు పంపుతున్నప్పుడు అందులో ఉన్న కంటెంట్ ముఖ్యం కానీ… అది ఆదివారమా – శనివారమా – సెలవు దినమా అన్నది ప్రధానం కాదు.. ఈ వ్యవహారం పూర్తిగా కోర్టు పరిధిలో జరుగుతుందే తప్ప… కేంద్ర ప్రభుత్వ పరిధిలో కాదనే విషయాన్ని బీఆరెస్ నేతలు గుర్తించాలి. చట్టం తనపని తానుచేసుకుపోతుందనే విషయాన్ని గమనించాలి.. అనేది బీజేపీ నేతల వాదన.

ఒక మహిళ అయ్యి ఉండి లిక్కర్ స్కాంలో ప్రధాన పాత్ర పోషించిన విషయాన్ని కూడా యావత్ మహిళా లోకం గమనించాలి.. రామచంద్ర పిళ్లై విచారణ, కవితకు బినామీ అంటూ ఆయన ఇచ్చిన వివరణ అనంతరం ఈడీ నోటీసులు ఇచ్చింది… అది మహిళా దినోత్సవం రోజు అవ్వడాన్ని యాదృచ్చికంగానే చూడాలి అనేది బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి వివరణ!

కాగా… రేపు విచారణ నిమిత్తం హస్తినకు రావాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు అందించిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో పెనుదుమారమే రేపుతుంది!