కొడంగల్ టిఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి కి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నోటీసులు జారీ అయ్యాయి. బుధవారం నరేందర్ రెడ్డి బంధువు ఫామ్ హౌస్ లో ఇన్ కం ట్యాక్స్ అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో 51 లక్షల రూపాయలు పట్టుబడినట్లు ఐటి అధికారులు ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చారు.
అయితే ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో? దీని తాలూకు వివరాలు తెలపాల్సిందిగా టిఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఎలక్షన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. తక్షణమే 51 లక్షల పై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
రేవంత్ చెప్పిన లెక్కలు వేరే ఉన్నాయే
పట్నం నరేందర్ రెడ్డి ఇంట్లో ఐటి అధికారుల సోదాల్లో డబ్బు దొరకడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపింది. ఈ సోదాల్లో కేవలం 51 లక్షలు మాత్రమే దొరికినట్లు ఐటి అధికారులు అందించిన సమాచారం బట్ట ితెలుస్తుండగా రేవంత్ రెడ్డి మాత్రం తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. గత నాలుగు నెలలుగా పట్నం నరేందర్ రెడ్డి ఎవరి ఇంట్లో అయితే నివాసం ఉంటున్నారో వారి ఇంట్లో 17 కోట్లా 51 లక్షల రూపాయలు దొరికాయని ఆయన ఆరోపించారు.
గురువారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ డబ్బు లెక్కల్లో ఇంత భారీ తేడా ఎందుకు చూపిస్తున్నారని ప్రశ్నించారు. ఈ కేసులో డబ్బు కట్టల లెక్కలు తారుమారు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యాయలంలోని కీలక అధికారులు రంగంలోకి దిగారని రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. ఐటి అధికారులపై, ఎన్నికల సంఘం అధికారులపై తీవ్రమైన వత్తిళ్ళు వస్తున్నాయని ఆయన ఆరోపించారు.
అంతేకాకుండా తనను అంతమొందిచేందుకు కేసిఆర్ సర్కారు నిర్దిష్టమైన ప్రణాళిక సిద్ధం చేసిందని ఆరోపించారు. తన మీద మఫ్టీలో ఉన్న పోలీసుల చేత దాడులు చేయించబోతున్నారని ఆందోళన చేశారు. గతంలో ప్రజా కవి గద్దర్ మీద దాడులు చేసిన రీతిలోనే తన మీద కూడా దాడులు జరపబోతున్నారని అనుమానం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.
ఈసి నోటీసులు జారీ చేయడంతో కొడంగల్ టిఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ నెలకొంది. ఈసి ఇచ్చిన నోటీసుకు జవాబు చెప్పే పనిలో నిమగ్నమయ్యారు టిఆర్ఎస్ నేతలు. అయితే దొరికిన్న సొమ్ము అధికారికంగా చూసినా 51 లక్షలు కావడం చర్చనీయాంశమైంది. ఐదు పది లక్షలైతే వివరణ ఇవ్వొచ్చు కానీ అర కోటి రూపాయలు దొరకడంతో దీనిపై ఎలాంటి వివరణ ఇస్తారో చూడాల్సి ఉంది.
మరోవైపు కొడంగల్ లో టిఆర్ఎస్ అభ్యర్థి బంధువు ఫామ్ హౌస్ లో నోట్ల కట్లలు బయటపడడంతో రేవంత్ రెడ్డి ఈ ఇష్యూని సీరియస్ గా వాడుకుంటున్నారు.