కొత్త ఇరకాటంలో టిఆర్ఎస్ డిఎస్.. కిం కర్తవ్యం ?

ఉమ్మడి రాష్ట్రంలో డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. రెండు సార్లు ఆయన పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలో ఒకసారి ఆయన ఓటమిపాలయ్యారు. ఒకసారి గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాజకీయాల్లో డిఎస్ సుపరిచితులు. అయితే ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ సాధించేందుకు టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ సిఎం కేసిఆర్ డిఎస్ ను పార్టీలోకి తీసుకోవడమే కాదు.. తొలుత ప్రభుత్వ సలహాదారు పోస్టు ఇచ్చారు. అనతికాలంలోనే రాజ్యసభ సీటు కట్టబెట్టి గౌరవించారు. అయితే డిఎస్ టిఆర్ఎస్ లో చేరినా అక్కడ సౌఖ్యంగా లేడని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినబడ్డాయి. ఆయన టిఆర్ఎస్ లో ఉండి బిజెపిలో ఉన్న తన తనయుడు ధర్మపురి అర్వింద్ కోసం పనిచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలు చేసిందెబరో కాదు.. సిఎం తనయ, నిజామాబాద్ ఎంపి కవితనే. దీంతో డిఎస్ మీద వేటు నేడో రేపో పడుతుందేమో అనుకున్నారు. కానీ ఈ వ్యవహారాన్ని ఎటూ తేల్చకుండానే కేసిఆర్ నాన్చివేత ధోరణి అవలంభిస్తున్నారు.

ఇదిలా ఉంటే డిఎస్ కాంగ్రెస్ గూటికి చేరవచ్చని జోరుగా ప్రచారం సాగింది. ఆయన ఢిల్లీ వెళ్లి రహస్యంగా సోనియాగాంధీతోపాటు సీనియర్ కాంగ్రెస్ నేతలను కలిశారని విమర్శలొచ్చాయి. త్వరలోనే ఆయన కాంగ్రెస్ లో చేరవచ్చని టిఆర్ఎస్ వర్గాల్లో కూడా టాక్ నడిచింది. ఆయన కాంగ్రెస్ పెద్దలతో టచ్ లో ఉన్నారని టిఆర్ఎస్ వర్గాల నుంచే వార్తలు వచ్చాయి. ఇలా వార్తలు వచ్చిన తరుణంలోనే కవిత బాంబు పేల్చారు. దీంతో డిఎస్ కు టిఆర్ఎస్ కు మధ్య దూరం పెరిగింది. ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తారని ఖాయమైంది. కానీ చిరకాల స్నేహితుడు కావడంతో డిఎస్ మీద వేటుకు వెనుకంజ వేశారు కేసిఆర్. ఈ నేపథ్యంలో డిఎస్ కాంగ్రెస్ లో చేరతారని ఎప్పుడైతే ప్రచారం మొదలైందో.. అప్పటినుంచి కాంగ్రెస్ నేతలు అలర్ట్ అయ్యారు. డిఎస్ ను రానిచ్చే సవాల్ లేదని తేల్చిపారేశారు. కాంగ్రెస్ లో అన్ని పదవులు అనుభవించి తీరా కష్టకాలంలో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన డిఎస్ తిరిగి ఇప్పుడు కాంగ్రెస్ బలపడుతున్న వేళ మల్లా వచ్చి టిఆర్ఎస్ లో పదవి పొందే ప్రయత్నాలే తప్ప కాంగ్రెస్ కు ఆయనతో ఒరిగేదేమీలేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

డిఎస్ కాంగ్రెస్ లో చేరితే రానున్న ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ సీటులో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేయవచ్చని అంటున్నారు. అదే జరిగితే ఇప్పటికే నిజామాబాద్ రూరల్ సీటుపై కాంగ్రెస్ లో పెద్ద పెద్ద లీడర్లే కన్నేశారు. వారిలో ప్రస్తుత శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ లో పోటీ చేయవచ్చని ప్రచారం జరుగుతున్నది. ఆయనతోపాటు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కూడా నిజామాబాద్ రూరల్ మీద కన్నేశినట్లు చెబుతున్నారు. వీరిద్దరూ డిఎస్ రాకుండా అడ్డుకునేందుకు తమ శక్తి మేరకు పావులు కదుపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. డిఎస్ వస్తే తమ సీట్లలో మార్పులు వస్తాయన్న భయంతోపాటు తమ పైన డిఎస్ పెత్తనం చేసే ప్రమాదముందని నిజామాబాద్ జిల్లా లీడర్లు ఆందోళన చెందుతున్నారు. దాంతోపాటు ఒకవేళ రేపు కాంగ్రెస్ సర్కారు వస్తే సీనియర్ జాబితాలోకి చేరిపోయి మంత్రి పదవి రేస్ లో డిఎస్ వచ్చే ప్రమాదముందని వారు ఆందోళన చెందుతున్నారట. గతంలో రెండు టర్మ్ లు పిసిసి ప్రసిడెంట్ గా పనిచేసిన సమయంలో కాంగ్రెస్ అధిష్టానం వద్ద తనకున్న పలుకుబడిని ఉపయోగించి రేపు మంత్రి పదవుల దగ్గర పోటీగా మారవచ్చని ఈ లీడర్లు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా బిసి నేత కోటాలో మంత్రి పదవి వస్తే ఇక జిల్లాలో ఎవరికీ పదవులు రాకుండాపోయే ప్రమాదముందని మిగతా లీడర్లు కూడా భయపడుతున్నారని అంటున్నారు.

డిఎస్ రాక మీద మాజీ నిజామాబాద్ ఎంపి మదు యాష్కీ గౌడ్ కొత్త వాదన తెరపైకి తెచ్చారు. అసలు డిఎస్ కాంగ్రెస్ లోకి వచ్చే చాన్సే లేదని తేల్చి పారేశారు. డిఎస్ బిజెపిలోకి పోతాడని తనకు సమాచారం ఉందని బాంబు పేల్చారు. డిఎస్ కొడుకు ఇప్పటికే బిజెపిలో పనిచేస్తున్నారని త్వరలోనే డిఎస్ కూడా బిజెపి గూటికి చేరతారని మధు యాష్కీ తెలిపారు. డిఎస్ కొడుకు, ఎంపి కవిత ఇద్దరూ పరస్పర అవగాహనతో ఉన్నట్లు యాష్కీ ఆరోపించారు. తాను మాత్రం రానున్న ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపి స్థానం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

మొత్తానికి డిఎస్ ఇటు టిఆర్ఎస్ లో ఇమడలేక అటు కాంగ్రెస్ పార్టీలో చేరలేక నానా రకాలుగా అవస్థలు పడుతున్నట్లు నిజామాబాద్ రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి మధు యాష్కీ చెప్పినట్లు ఆయన బిజెపి వైపు మళ్లే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమని అంటున్నారు.