సీఎం కేసీఆర్, డీఎస్ ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్టుగా కనిపిస్తోంది. కొడుకుల రాజకీయ జీవితం కోసం డీఎస్ టిఆర్ ఎస్ లో ఉంటూనే పక్క పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారన్న ఆరోపణల నుంచి వీరి మధ్య దూరం వచ్చింది. అయితే గవర్నర్ ఇచ్చిన తేనీటి విందులో ఇది చాలా స్పష్టంగా కనబడింది.
స్వాతంత్ర్య దినోత్సవం సంధర్బంగా గవర్నర్ రాజ్ భవన్ లో తేనీటి విందు ఇచ్చారు. కార్యక్రమానికి డీఎస్ ముందుగానే వచ్చి ప్రముఖులతో కూర్చున్నారు. సీఎం కేసీఆర్ అక్కడికి వచ్చిన తర్వాత అందరిని పలకరించారు. డీఎస్ తన ఎదురుగా కూర్చున్నా సీఎం పలకరించలేదు. డీఎస్ కూడా కేసీఆర్ దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. ఎవరో తెలియదు అన్నట్టుగా ఎడమొహం, పెడమొహంలా ఇద్దరూ వ్యవహరించారు. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరాయని అందరికి స్పష్టంగా అర్ధమయ్యింది.
డీఎస్ కాంగ్రెస్ లో ఒక వెలుగు వెలుగొందిన నేత. టిఆర్ ఎస్ లో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కుమారుల రాజకీయ భవిష్యత్ కోసం బిజెపి, కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నాడని అందుకే అతనిని సస్పెండ్ చేయాలని ఎంపీ కవిత కేసీఆర్ కు నివేదించారు. దీంతో అప్పటి నుంచి వీరి మధ్య రాజకీయ ఎడం ఎక్కువైంది. ఆ తర్వాత డీఎస్ కుమారుడు విద్యార్ధినిలపై లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని కేసు నమోదు కావడం, అతను పోలీసులకు దొరకకుండా పారిపోయి ఎట్టకేలకు లొంగిపోవడం కేసు విచారణ జరుగుతుండటం ఇవన్ని కూడా డీఎస్ ను ఇరుకున పెట్టాయి. ఇంత జరిగినా కేసీఆర్ డీఎస్ కు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో డీఎస్ కూడా టిఆర్ ఎస్ తో తెగదెంపులకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.