ఎన్నికల సీజన్ లో ఎవరేం మాట్లాడినా చెల్లు బాటు అవుతుందేమో. అంతకు ముందు దాకా మా ముఖ్యమంత్రి అన్నవాళ్లే ఒక్కసారిగా రివర్స్ గేర్ వేసి విమర్శలు, వ్యంగ్య బాణాలు విసరటం మొదలెడుతున్నారు. సినిమా వాళ్లు కూడా ఆ లిస్ట్ లో చేరారు. తెలుగుదేశం కు సపోర్ట్ గా నిలిచి, గతంలో యాడ్స్ చేసి ప్రచారం చేసిన నటుడు, దర్శకుడు రవిబాబు..ఈ సారి డైరక్ట్ గా ఎన్నికల ప్రచారంలోకు దూకారు. ప్రచారంలో భాగంగా..కేసీఆర్ పై విమర్శలు చేసారు.
నల్లగొండలో పోటీచేస్తే కోమటిరెడ్డి సోదరుల చేతిలో ఓడిపోతానన్న భయంతోనే కేసీఆర్ గజ్వేల్ కు పారిపోయారని రవిబాబు వ్యాఖ్యానించారు. నల్లగొండ జిల్లాలో మంగళవారం కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంటకరెడ్డితో కలిసి రవిబాబు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో నల్లగొండ ఆత్మగౌరవం గెలుస్తుందో లేక కేసీఆర్ దోపిడీ చేసిన వందలకోట్ల సొమ్ము గెలుస్తుందో డిసెంబర్ 11న తేలుతుందన్నారు. నల్లగొండలో గత 20 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వెనుకపడిందన్న కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు.
నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి సోదరుల హయాంలో అద్భుతమైన అభివృద్ధి చోటుచేసుకుందన్నారు. నల్లగొండ మున్సిపాలిటీకి నిధులు విడుదల చేయకుండా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో మంత్రి కేటీఆర్ ను అడగాలని దుయ్యబట్టారు.