రెంటికీ చెడ్డ రేవడిలా బీఆర్ఎస్ అధినేత కేసీయార్.!

జాతీయ స్థాయిలో భారత్ రాష్ట్ర సమితి పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతోంది. ఢిల్లీ స్థాయి నాయకులెవరూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్‌ని పట్టించుకోవడంలేదు. ‘దేశ్ కీ నేతా కేసీయార్’ అని గులాబీ శ్రేణులు నినదించడం తప్ప, ఆయన్ని అలా ఎవరూ గుర్తించడంలేదాయె.

ఎప్పుడైతే కేసీయార్ దేశ్ కీ నేతా అని గులాబీ శ్రేణులు అనేశాయో, తెలంగాణకీ నేతా ఎవరు.? అన్న ప్రశ్న తెరపైకొచ్చింది. కేటీయాచ్, కవిత, హరీష్ రావు.. ఈ ముగ్గురిలో ఎవరికి తెలంగాణలో అవకాశం దక్కనుంది.? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఆర్ఎస్ తరఫున ఎవరు.? అన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.

గతంలో తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుడే తొలి ముఖ్యమంత్రి.. అంటూ కేసీయార్ నినదించారు. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత్ రాష్ట్ర సమితి అయ్యింది గనుక.. తెలంగాణ ముఖ్యమంత్రి పదవి ఈసారైనా దళిత సామాజిక వర్గానికి కేసీయార్ ఆఫర్ చేస్తారా.? అన్న చర్చ జరుగుతోంది.

ఈ గందరగోళం నడుమ, గులాబీ శ్రేణులు రాజకీయ ప్రత్యర్థులకు సమాధానం చెప్పలేకపోతున్నాయి. అక్కడ ఢిల్లీలో కేసీయార్ బీఆర్ఎస్ రాజకీయం బెడిసి కొడుతోంది. ఇక్కడ తెలంగాణలో పార్టీ పరువు పోతోంది. ముందైతే, 2023 ఎన్నికల్లో తెలంగాణలో తిరిగి అధికారం నిలబెట్టుకోవాలి కేసీయార్.

ఒకవేళ అలా జరగని పక్షంలో, ఆ తర్వాత జరిగే లోక్ సభ ఎన్నికల నాటికి భారత్ రాష్ట్ర సమితి చాలా చాలా నష్టపోవడం ఖాయం.