ఎన్నికలు ముగిసిన తర్వాత టిఆర్ఎస్ పార్టీలో నేతల మధ్య విబేధాలు బయటపడుతున్నాయి. స్వంత పార్టీ నేతలే ఎన్నికలలో సహకరించకుండా పార్టీకి ద్రోహం చేశారని కొంత మంది నేతలు నేరుగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కు ఫిర్యాదు చేశారు. నల్లగొండ జిల్లాలో కోవర్టుల కలకలం మరువక ముందే పెద్దపల్లిలో మరో కలకలం రేగింది. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరి చదవాల్సిందే…
పెద్దపల్లి లోక్ సభ పరిధిలోని నియోజకవర్గాలలో మాజీ ఎంపీ వివేక్ టిఆర్ఎస్ కు నష్టం జరిగేలా వ్యవహరించారని ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయం పై ఎమ్మెల్యేలు నేరుగా కేటిఆర్ కు ఫిర్యాదు చేశారు. బెల్లంపల్లిలో బిఎస్పీ అభ్యర్ధిగా వివేక్ సోదరుడు వినోద్ పోటి చేశారు. వివేక్ పార్టీకి సహకరించకుండా తన సోదరునిగా సహకరించారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. కొప్పుల ఈశ్వర్ ధర్మపురి, దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి, బాల్క సుమన్ చెన్నూర్ సోమారపు సత్యనారాయణ రామగుండం లు గురువారం తెలంగాణ భవన్ లో కేటిఆర్ ను కలిశారు.
ఇటివల జరిగిన టిఆర్ఎస్ కృతజ్ఞత సభలో ద్వితీయ శ్రేణి నేతలు వివేక్ ను లక్ష్యంగా చేసుకొని మాట్లాడారు. పలు సభలల్లో బహిరంగంగానే విమర్శించారు. వీటన్నింటి పై ఎమ్మెల్యేలు కేటిఆర్ కు ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీ వివేక్ కూడా టిఆర్ ఎస్ భవన్ లో కేటిఆర్ ను కలిశారు. తాను ప్రచారం చేసిన ప్రాంతాల్లో అభ్యర్దులు అధిక మెజార్టీతో గెలిచారని వివేక్ కేటిఆర్ కు వివరించినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల ఫిర్యాదు, మాజీ ఎంపీ వివరణతో శుక్రవారం నేతలందరితో మరోసారి కేటిఆర్ భేటి కానున్నారు.
ఒకే సారి ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా ఫిర్యాదు చేయడంతో పెద్దపల్లిలో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పార్టీలో విబేధాలు నేతలను కలవర పెడుతున్నాయి. ఓ వైపు జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తుంటే మరో వైపు స్వంత పార్టీలో నేతల తీరు పార్టీలో చర్చనీయంశమైంది.