Ghantasala The Great: దిగ్గజ సంగీత దర్శకుడు, తన విలక్షణమైన బాణీలతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఘంటసాల వారి జీవిత చరిత్రను తెరపైకి తీసుకు వచ్చారు దర్శకుడు సి.హెచ్. రామారావు. ఘంటసాల జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘ఘంటసాల ది గ్రేట్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. అన్యుక్త్ రామ్ పిక్చర్స్ బ్యానర్ మీద ఓ మంచి పాట లాంటి సినిమాను శ్రీమతి సి.హెచ్. ఫణి నిర్మించారు. ఈ చిత్రంలో ఘంటసాల వారి పాత్రను సింగర్ కృష్ణ చైతన్య పోషించారు. కీలక పాత్రలో సుమన్ నటించారు. ఈ మూవీని జనవరి 2న ఘనంగా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో స్వరవాహిని, శ్రీభారతి మ్యూజిక్ అకాడమీ వారు కలిసి ‘ఘంటసాల ది గ్రేట్ స్పెషల్ మ్యూజికల్ నైట్’ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..
*దర్శకుడు సి.హెచ్. రామారావు మాట్లాడుతూ..* ‘‘ఘంటసాల వారి పాటల గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ ‘ఘంటసాల ది గ్రేట్’ మూవీని చేశాను. ఓ సారి శ్రీశ్రీ గారు ఘంటసాల వారి వద్దకు వెళ్లారు. ఆయన రాసిన పాటను ఘంటసాల వారు పాడిన తరువాత శ్రీశ్రీ గారు మంత్ర ముగ్దులయ్యారు. ‘నేను ఇంత గొప్ప పాట రాశానా? అని మీరు పాడిన తరువాత అనిపిస్తోంది’ అని శ్రీశ్రీ ప్రశంసించారు. అంత గొప్ప గాయకుడు ఘంటసాల. అందుకే ‘ఘంటసాల ది గ్రేట్’ అని టైటిల్ పెట్టాం. మా మూవీని రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చిన శోభ గారికి ధన్యవాదాలు. ఈ చిత్రం ఇప్పటికే ఖండాంతరాలు దాటింది. ఆస్ట్రేలియాలో ఈ మూవీని ప్రదర్శించాం. ఈ మూవీని తెలుగు ప్రేక్షకులందరూ చూసి విజయాన్ని అందించాలి’ అని అన్నారు.
*ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ..* ‘మహోన్నతమైన వ్యక్తి ఘంటసాల. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఈ ‘ఘంటసాల ది గ్రేట్’ మూవీ ఘన విజయం సాధించాలి. ఎన్ని అడ్డంకులు ఏర్పడినా సరే ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలి’ అని అన్నారు.
*శోభా రాణి మాట్లాడుతూ..* ‘ఘంటసాల వారి గురించి చెప్పడానికి నా జీవితం సరిపోదు. నేను ఇప్పటి వరకు దాదాపు 76 చిత్రాల్ని రిలీజ్ చేశాను. ఎన్నో సినిమాల్ని రిలీజ్ చేశాను కానీ అవన్నీ ఒకెత్తు.. ఈ ‘ఘంటసాల ది గ్రేట్’ ఒకెత్తు. ఈ మూవీని రిలీజ్ చేస్తాను అని నేనే రామారావు గారిని అడిగాను. రామారావు గారు ఎంతో కష్టపడి ఈ మూవీని చేశారు. ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. జనవరి 2న మా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది’ అని అన్నారు.
*ప్రముఖ నిర్మాత టీఎస్ రావు మాట్లాడుతూ..* ‘ఘంటసాల వారి పేరు వినగానే తెలుగు ప్రేక్షకులందరికీ ఎన్నెన్నో గొప్ప పాటలు గుర్తుకు వస్తుంటాయి. అలాంటి మహనీయుల వారి జీవిత చరిత్రను తెరపైకి తీసుకు రావాలనే ఆలోచన వచ్చిన దర్శక, నిర్మాతలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇదొక గొప్ప ప్రయోగం అని చెప్పాలి. ఈ మూవీ జనవరి 2న విడుదల కాబోతోంది. కొత్త ఏడాది ప్రారంభంలోనే ‘ఘంటసాల ది గ్రేట్’ అనే పదాన్ని ఘంటాపథంగా వినబోతోన్నాం. శోభా గారు ఈ మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీని అందరూ చూసి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*వకుళాభరణం కృష్ణ మోహన్ మాట్లాడుతూ..* ‘సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఘంటసాల వారి గానం ఉంటుంది. బాల కామేశ్వర్ గారు పాడితే అచ్చం ఘంటసాల గారు పాడినట్టే ఉంటుంది. శోభ గారు ఎంతో సాహసం చేసి ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ప్రతీ తెలుగు వాడు ఈ మూవీని చూసి హిట్ చేయాలి. ఇది మనందరి జీవిత గాథ. తెలుగు జాతి గొప్పదనం.. తెలుగు భాష ఔన్నత్యం. తెలుగు సంగీతానికి పట్టం కట్టేటువంటి మహోత్కృష్టమైన యజ్ఞం చేసిన రామారావు గారి జీవితం ధన్యమైందని చెప్పాలి. ఈ చిత్రం సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉంటుంది’ అని అన్నారు.
*ప్రముఖ దర్శకుడు సముద్ర మాట్లాడుతూ..* ‘‘ఘంటసాల ది గ్రేట్’ మూవీని శోభా గారు జనవరి 2న విడుదల చేస్తున్నారు. ఈ మూవీ దర్శక, నిర్మాతలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఘంటసాల వారు ఎంతో మందిని తన గాత్రంతో స్టార్‌లను చేశారు. ఆయన పాడిన పాటలతో వందల చిత్రాలు విజయాన్ని సాధించాయి. ఈ రోజు చిత్ర సీమ ఇంతలా ఎదిగిందంటే.. ఘంటసాల వారే మెయిన్ పిల్లర్. ఈ చిత్రంలో నటించిన, నిర్మించిన ప్రతీ ఒక్కరూ ధన్యులే. తెలుగు జాతి, తెలుగు ప్రేక్షకుల్లో ప్రతీ ఒక్కరూ చూడాల్సిన చిత్రమిది’ అని అన్నారు.
*లిరిక్ రైటర్ వెన్నిగల రాంబాబు మాట్లాడుతూ..* ‘ఘంటసాల వారు తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పుడూ చిరస్థాయిగా ఉంటారు. అలాంటి మహనీయులైన ఘంటసాల వారి జీవిత చరిత్రను తెరకెక్కించిన రామారావు గారు ధన్యులు. ఈ మూవీని శోభా గారు విడుదల చేస్తుండటం ఆనందంగా ఉంది. ఘంటసాల వారి కీర్తి ప్రపంచ దేశాల్లోనూ విస్తరించింది. ఇందులో ఓ పాటను రాసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ మూవీని అందరూ చూసి సక్సెస్ చేయాలి’ అని అన్నారు.
*సంగీత దర్శకుడు రవి శంకర్ మాట్లాడుతూ..* ‘నేను ఓ సంగీత దర్శకుడిగా ఘంటసాల వారి గురించి మాట్లాడే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన ప్రపంచ వ్యాప్తంగా తెలిసిన వ్యక్తి. మహ్మద్ రఫీ, బడే గులాం అలీ ఖాన్, కిషోర్ కుమార్ వంటి వారితో పోటీ పడీ మరీ పాడారు. అందుకే ఆయన అంత గొప్ప స్థాయికి వెళ్లారు. సూర్యచంద్రులున్నంత వరకు ఆయన ఖ్యాతి అలా ఉంటుంది. శోభా గారు ఈ మూవీని రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. జనవరి 2న ఈ మూవీని అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
*కర్రి బాలాజీ మాట్లాడుతూ..* ‘‘ఘంటసాల ది గ్రేట్’ మూవీని తెలుగు వారందరూ చూడాలి. ఈ మూవీని చూసి హిట్ చేస్తేనే ఇంకా ఇలాంటి గొప్ప గొప్ప చిత్రాల్ని చేయడానికి ప్రోత్సాహకం లభిస్తుంది. జనవరి 2న ఈ మూవీని చూడండి. ఈ మూవీ కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. పెట్టే డబ్బులకు న్యాయం జరుగుతుంది’ అని అన్నారు.
*ప్రముఖ దర్శకుడు మల్లిఖార్జున్ మాట్లాడుతూ..* ‘‘ఘంటసాల ది గ్రేట్’ మూవీని తెరకెక్కించిన రామా రావు గారికి ధన్యవాదాలు. ప్రపంచ వ్యాప్తంగా ఘంటసాల గారికి అభిమానులున్నారు. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు.
అంతే కాకుండా ‘ఘంటసాల ది గ్రేట్’ మూవీని సెలెబ్రిటీలకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ ప్రివ్యూని సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె, సింగర్ కౌసల్య, సింగర్ విజయలక్ష్మీ తదితరులు వీక్షించారు. సినిమాను వీక్షించిన అనంతరం రఘు కుంచె, కౌసల్య, విజయలక్ష్మీ వంటి వారు తమ తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. అద్భుతమైన సినిమాను తెలుగు ప్రేక్షకులంతా చూడాలని అన్నారు. తెలుగు ప్రజలందరూ చూడాల్సిన, తెలుసుకోవాల్సిన కథ అని పొగిడారు. ఘంటసాల వారి వ్యక్తిత్వాన్ని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని ప్రివ్యూ చూసిన అందరూ అన్నారు.

