తెలంగాణ ఎన్నికలపై జాతీయ ఛానెళ్లు అన్నీ టిఆర్ఎస్ రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ వెలువరించాయి. అయితే అన్నింటిలో కంటే ఇండియా టుడే సంస్థ టిఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టబోతున్నారని వెల్లడించింది. టిఆర్ఎస్ కు అన్ని ఛానెళ్ల కంటే ఇండియా టుడే ఎక్కువ సీట్లు వస్తాయని తేల్చింది. ఏ సంస్థ ఇవ్వని రీతిలో టిఆర్ఎస్ కు 79 నుంచి 91 సీట్లు రాబోతున్నట్లు ఇచ్చింది. దీంతో ఇండియా టుడే సర్వే ఫలితాలపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. అయితే ఆ సర్వే ఫలితాలన్నీ ఫసక్ అని తేల్చి పారేశారు తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
హోటల్ గోల్కొండలో జరిగిన కూటమి ప్రెస్ మీట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనబడిందన్నారు. ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ గా పని చేసిన మహా కూటమి కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఒక దశ ముగిసిందని, ఇప్పుడు మరింత అలర్ట్ గా ఉండాలని కార్యకర్తలకు ఉత్తమ్ సూచించారు. సర్వేల విషయంలో ఎవరికి తోచినట్లు వారు సర్వేలు చేసుకుంటున్నారని అన్నారు. కూటమి 70 నుంచి 80 స్థానాలు గెలువబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. మహా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందన్నారు.
ఇండియా టుడే ఫలితాల విషయమై ఉత్తమ్ మాట్లాడుతూ ఆ టివి సంస్థ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ తనకు ఫోన్ చేశారని గుర్తు చేశారు. తమ సర్వే రిపోర్టు చూసి కంగారు పడొద్దని చెప్పినట్లు వివరించారు. ఇండియా టుడే సర్వేలో ఉన్నట్లే ఫలితాలు వస్తాయనుకోవాల్సిన పనిలేదన్నారని ఉత్తమ్ వెల్లడించారు. తాము వేస్తున్నట్లే ఫలితాలు వస్తాయనుకోవద్దని చెప్పినట్లు వివరించారు. జాతీయ మీడియా సంస్థలన్నీ బిజెపి ఫెవర్ గా ఉన్నాయని విమర్శించారు.
స్ట్రాంగ్ రూముల్లో ఇవిఎం లు భద్రపరిచిన తర్వాత లోపలికి అధికారులు కూడా వెళ్లడానికి వీలులేదని స్పష్టం చేశారు. కార్యకర్తలు అలర్ట్ గా ఉండాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మా కార్య కర్తలు ఉండేందుకు అనుమతి ఇవ్వాలని ఉత్తమ్ కోరారు. ఈ విఎం రి ప్లేస్ మెంట్ జరుగకూడదన్నారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ కు వచ్చే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తన గడ్డం తీసే సమయం దగ్గరపడిందని ఉత్తమ్ చమత్కరించారు. ఎన్నికల కమిషన్ పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు. లక్షలాది మంది ఓటర్లు తమ పేర్లను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
నియంత పాలనకు అంతం : ఎల్ రమణ
తెలంగాణలో 52 నెలల నియంత పాలనకు అంతం పలికేందుకు మహా కూటమిగా ఏర్పాటయ్యామని అన్నారు టిడిపి అధ్యక్షులు ఎల్. రమణ. 60 నెలలు పరిపాలన చేయమని ప్రజలు చెప్తే దాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసాడు కేసీఆర్ అని విమర్శించారు. కేసీఆర్ స్వంతంగా ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని పాలన చేశారని విమర్శించారు. 2014 కంటే ఇప్పుడు ఓటింగ్ పెరిగిందన్నారు. ఆత్మగౌరవం లేని కేసీఆర్ పాలనను ప్రజలు కొరుకోవడం లేదన్నారు.
తమ కూటమికి 70 – 80 స్థానాలు వస్తున్నాయని జోస్యం చెప్పారు. కేసీఆర్ కుటుంబం వందల కోట్ల ధనాన్ని వెదజల్లినా ఓటర్లను ప్రభావితం చేయలేక పోయారన్నారు. మోడీ తో కేసీఆర్ కుమ్మక్కు అయ్యాడని ఆరోపించారు. 30 ఏళ్ల లో ఎప్పుడు కాంగ్రెస్ తో కలువంది ఇప్పుడు కలిసాము అది కేవలం కేసీఆర్ ను దింపడం కోసమే అని స్పష్టం చేశారు. మోదీ కేసిఆర్ చర్యలు ప్రమాదకరంగా ఉన్నాయన్నారు.