తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు సీఎం కుర్చీ గురించి విషయంలో జరుగుతున్న రచ్చ అంతా ఇంత కాదు. అధికార మార్పులు తప్పకుండా ఉంటాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ స్థానంలో ముఖ్యమంత్రిగా కేటీఆర్ ను నియమించుబోతున్నారని కేటీఆర్ కు మద్దతుగా టీఆర్ఎస్ నేతలు పోటీపడి మరీ ప్రకటనలు చేస్తున్నారు. అటు విపక్షాలు మాత్రం ముఖ్యమంత్రి మార్పు ఉండకపోవచ్చంటున్నారు. కేటీఆర్ ను సీఎం చేస్తే.. టీఆర్ఎస్ పార్టీ చీలిపోవడం ఖాయమని కూడా కొందరు విపక్ష నేతలు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. జగ్గారెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ వచ్చాక అవినీతి పెరిగిపోయిందన్నారు. ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నపుడు హరీష్ రావు ఐదారు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు . ఆ బ్లాక్ మనీ తోనే కేసీఆర్ సర్కార్ ను పడేసే ప్రయత్నం చేశారంటూ హాట్ కామెంట్స్ చేశారు జగ్గారెడ్డి. కేసీఆర్ సర్కార్ ను కూల్చేందుకు హరీష్ రావు ప్రయత్నించారని తెలియడం వల్లే… కొంత కాలం ఆయనను కేసీఆర్ దూరం పెట్టారని చెప్పారు జగ్గారెడ్డి.
తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ తప్పు పనిచేసిందని హాట్ కామెంట్స్ చేశారు జగ్గారెడ్డి. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. కేసీఆర్ సర్కార్ మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి.. మెగా కృష్ణారెడ్డికి దారపోసిందని జగ్గారెడ్డి ఆరోపించారు. మారుతీ కారులో తిరిగిన మెగా కృష్ణా రెడ్డికి ఆరు ఏండ్లలోనే 30 వేల కోట్ల రూపాయల డబ్బు ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాల్లో కృష్ణా రెడ్డి కి కేసీఆర్ దోచిపెట్టారని చెప్పారు జగ్గారెడ్డి.