కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటి చేసిన రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో పోటి చేయాలని కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. గత రెండు రోజులుగా హైదరాబాద్ లోని రేవంత్ నివాసంలో కీలక కార్యకర్తల సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటి చేయాల్సిందే అని కార్యకర్తలంతా రేవంత్ రెడ్డి పై ఒత్తిడి తెచ్చారని చర్చ జరుగుతోంది.
మరో 4 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి. మార్చిలో లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. మేలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికే కాంగ్రెస్ లోని కీలక నేతలంతా ఎంపీ ఎన్నికల పై ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు ఆలస్యంగా జరగడం, ప్రచారానికి సమయం లేకపోవడం కూడా ఓటమికి కారణమైందని కాంగ్రెస్ నేతలు విశ్లేషిస్తున్నారు. ఆ తప్పిదం పార్లమెంట్ ఎన్నికల పై పడకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తలు పాటిస్తున్నట్టు అర్ధమైతుంది.
రేవంత్ రెడ్డి ఎంపీగా ఎక్కడి నుంచి పోటి చేస్తారనేది ఆసక్తిగా మారింది. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం పై సర్వత్రా ఆసక్తిగా మారింది. రేవంత్ రెడ్డి ఆసక్తి కనబరిస్తే మాత్రం ఆయనకు ఖచ్చితంగా అధిష్టానం టికెట్ ఇస్తుందని, ఆ విషయంలో అనుమానాలు అక్కర్లేదని కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి పార్లమెంట్ వైపు అడుగులు వేయరని కొందరు అంటుంటే, రాజకీయ జీవితం కోసం తప్పకుండా రేవంత్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటి చేస్తారని మరి కొందరు చర్చించుకుంటున్నారు.
రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్ గా రాష్ట్రమంతా పర్యటించారు. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కొడంగల్ లో గెలిచి తీరుతారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా టిఆర్ఎస్ అభ్యర్ధి రేవంత్ రెడ్డి పై 9 వేల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో అంతా కూడా షాకయ్యారు. రేవంత్ రెడ్డి ఓడిపోవడమేంటని చర్చించుకున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పై సానుభూతి కనిపిస్తుంది. ఇలాంటి సమయంలోనే లోక్ సభకు పోటి చేస్తే ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం ఉందని కొందరు నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటి చేయాలని కార్యకర్తలు ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. మహబూబ్ నగర్ నుంచి పోటి చేస్తే ఖచ్చితంగా విజయం సాధించవచ్చని ఇప్పటి నుంచే ప్రణాళికతో పోతే విజయం సాధ్యమేనని అంతా భావిస్తున్నారు. జాతీయ రాజకీయాలలో కూడా కాంగ్రెస్ కు అనుకూల పవనాలు వీస్తున్నాయని, అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలిచినంత ఈజీగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలవలేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ నుంచి పోటి చేస్తే గెలవొచ్చని, గౌరవంగా కూడా ఉంటుందని కార్యకర్తలు రేవంత్ రెడ్డికి చెప్పినట్టు తెలుస్తోంది. దీని పై రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో అనేది చూడాలి.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను కాంగ్రెస్ పార్టీ విశ్లేషిస్తుంది. సీట్ల కేటాయింపు ఆలస్యం కావడం కొంపముంచిందని, ప్రచారానికి సమయం లేకపోవడంతో ప్రజలకు దగ్గర కాలేకపోయామని పలువురు నేతలు అధిష్టానానికి తెలిపారట. ఆ తప్పులు పార్లమెంట్ ఎన్నికల్లో జరగకుండా ఇప్పటి నుంచే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధుల ఎంపిక పై కసరత్తు పెట్టినట్టు తెలుస్తోంది. నల్లగొండ ఎంపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నల్లగొండ పార్లమెంట్ స్థానం దాదాపు ఖాయమైనట్టే. రేవంత్ కూడా కోరుకున్న స్థానాన్ని అధిష్టానం కేటాయించే అవకాశం ఉంది.
టిఆర్ఎస్ ప్రభంజనం ఉన్న సమయంలో చాలామంది కాంగ్రెస్ పెద్ద లీడర్లు పార్లమెంట్ కు పోటీ చేయాలంటే వెనకడుగు వేస్తున్న పరిస్థితి ఉంది. ఈ సమయంలోనే క్యాడర్ లో జోష్ నింపేలా, వారిని కార్యోన్ముఖులు చేసేలా రేవంత్ నిర్ణయం ఉంటుందని ఆయన సన్నిహితుడు ఒకరు “తెలుగురాజ్యం” కు చెప్పారు.
ఇప్పటికే నల్లగొండలో భూపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేరుకున్నారు. ఆయన నల్లగొండ పార్లమెంట్ కు పోటీ చేయడం ఖరారు అయింది. రాహుల్ అప్పటికే సంకేతాలు ఇచ్చారని అంటున్నారు. దీన్నిబట్టి చూస్తే కాంగ్రెస్ లో గట్టి సరుకు ఉన్న వాళ్ళను పార్లమెంట్ కు పోటీ చేయించే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది అని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ సారి గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది. సీనియర్లు, 60 సంవత్సరాలు దాటిన వారికి అవకాశం ఇవ్వకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లేవారికే అవకాశాలు ఇవ్వాలన్న ప్రతిపాదనలు ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే కీలక నేతలందరికి టికెట్లు వచ్చే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ నుంచి పోటి చేస్తారా లేక మరేదైన స్థానం నుంచి పోటి చేస్తారా అనేది తేలాల్సి ఉంది.