ఉస్మానియా యూనివర్సిటి.. తెలంగాణ ఉద్యమ వేళ హైదరాబాద్ నడిబొడ్డున గర్జించి పోరాడిన ధీరులు కలిగిన విద్యాలయం. 1969 తొలి దశ ఉద్యమమైనా, 2009 నుంచి ప్రారంభమైన మలిదశ పోరులోనైనా ఉస్మానియా యువకెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడి తెలంగాణ సాధించుకోవడంలో కీలక పాత్ర పోషించారు.
ఎందరో విద్యార్ధులు ఆత్మ బలిదానంతో అమరులయ్యారు. అటువంటి విద్యార్దులకు రాజకీయ ప్రాధాన్యత కలిపిస్తామని రాజకీయ పార్టీలు ప్రకటించినా అవి ఆచరణలో అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు విద్యార్ది నాయకులకు టికెట్లు ఇవ్వాలనే ప్రతిపాదనలు వచ్చాయి. వాటి వివరాలేంటంటే…
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఉస్మానియా విద్యార్దులు ఎన్నికల్లో పోటి చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక మంది విద్యార్దులు ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఇందులో ఎర్రోళ్ల శ్రీనివాస్, బాల్క సుమన్, గాదరి కిషోర్ లాంటి వారు టిఆర్ ఎస్వీలో క్రియాశీలకంగా పని చేసి వారు కేసీఆర్ కు అండగా నిలబడ్డారు.
దీంతో కేసీఆర్ 2014లో వారికి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లిచ్చారు. వారితో పాటు మరికొంత మంది విద్యార్దులున్నా వారికి అధిక ప్రాధాన్యత కల్పించలేదు. దీంతో కాంగ్రెస్ నుంచి పోటి చేయాలని భావించిన విద్యార్ది నాయకులు పలు పార్టీల నుంచి అప్పుడు పోటి చేసి భంగపడ్డారు.
తాజాగా ఎన్నికలు రావడంతో ఈ సారైనా తమకు సీట్లు వస్తాయన్న ఆశలో పలువురు విద్యార్ధి సంఘాల నేతలు కాంగ్రెస్ నేతలతో లాబీయింగ్ నడుపుతున్నట్టు తెలుస్తోంది. దాదాపు 10 మంది నేతలు కాంగ్రెస్ పెద్దలను కలిశారని వారిలో ముగ్గురికి టికెట్లిచ్చే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
టికెట్లు ఆశిస్తున్న వారిలో ఎన్ ఎస్ యూ ఐ ఓయూ నేత మానవతారాయ్, రాజారాం యాదవ్, పున్నా కైలాశ్ నేత, దరువు ఎల్లన్న, మేడిపల్లి సత్యం, చరణ్ కౌశిక్, క్రిశాంక్, బాల లక్ష్మీ, దుర్గం భాస్కర్, కేతూరి వెంకటేశ్, ,చారగొండ వెంకటేశ్ లు ఉన్నారు. వీరిలో గతంలోనే కొంత మంది టికెట్లు ఆశించగా వారికి భంగపాటు ఎదురైంది. ప్రస్తుతం మానవతారాయ్, చరణ్, పున్న కైలాశ్ , సత్యం, రాజారాం యాదవ్ లు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులుగా ఉన్నారు. ఓయూ నేతలు టికెట్లు ఆశిస్తున్న సీట్ల వివరాలివే…
మానవతారాయ్ (సత్తుపల్లి లేదా కంటోన్మెంట్)
పున్నా కైలాశ్ నేత (మునుగోడు)
రాజారాం యాదవ్ (ఆర్మూరు)
చరణ్ కౌశిక్ యాదవ్ (ఉప్పల్)
మేడిపల్లి సత్యం (చొప్పదండి)
బాలలక్ష్మి (జనగాం)
దరువు ఎల్లన్న (ధర్మపురి)
దుర్గం భాస్కర్ (బెల్లంపల్లి)
క్రిశాంక్ (కంటోన్మెంట్)
చారగొండ వెంకటేశ్ (అచ్చంపేట)
కేతూరి వెంకటేశ్ (కొల్లాపూర్)
ఈ సారి ఓయూ నేతలకు 3 టికెట్లు కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. 2014 ఎన్నికల్లోనే కంటోన్మెంట్ స్థానాన్ని క్రిశాంక్ , దరువు ఎల్లన్న లకు కేటాయించాలనుకున్నా చివరకు ప్రజాసంఘాల నేత గజ్జెల కాంతానికి కేటాయించారు. 3 సీట్లు కేటాయించి మిగిలిన వారికి పార్టీ అధికారంలోకి వస్తే నామినేటేడ్ పోస్టులిస్తామని కాంగ్రెస్ నేతలు ఓయూ నేతలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.