కేసీఆర్ ఓ నయా నవాబ్ ను తలపిస్తున్నాడని కాంగ్రెస్ నేత, ఏఐసిసి అధికార ప్రతినిధి ఖుష్బూ అన్నారు. తిరిగేందుకు కోట్ల విలువ చేసే కార్లు, ఉండేందుకు వందల కోట్ల బంగ్లా వీటన్నింటిని ఉపయోగిస్తూ నిజాం నవాబ్ ను తలపిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ కాదు కమీషన్ మ్యాన్ కేసీఆర్ అన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ జీరో కావడం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు.
తెలంగాణలో అధర్మ ప్రభుత్వం కొనసాగుతుందని, మావోయిస్టుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదన్నారు. ఫేక్ ఎన్ కౌంటర్లు చేస్తున్నారన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు సక్కగున్నాయని చెప్పుకునే కేసీఆర్ పోలీస్ పాలన సాగిస్తున్నారన్నారు. చిత్ర హింసలు పెట్టి, యాసిడ్ పోసి చంపేసిన శృతి ఎన్ కౌంటర్ పై కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. నాలుగున్నరేళ్లలో కేసీఆర్ చేసిందేంటని ప్రశ్నించారు. దళిత సీఎం హామీని డస్ట్ బిన్ లో పడేశారన్నారు. టిఆర్ఎస్ బిజెపి రెండు ప్రేమలో పడ్డాయని అవి త్వరలోనే కలిసి పెళ్లి చేసుకుంటాయన్నారు.
తెలంగాణలో ఆడపిల్లలకు రక్షణ కరువైందన్నారు. చిన్న చిన్న పిల్లలను వ్యభిచారులుగా మారుస్తున్నారన్నారు. యాదాద్రిలో దేవుని సాక్షిగా చిన్నారుల పై అత్యాచారాలు జరుగుతుంటే ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణలో నిత్యం అనేక మంది మీద అత్యాచారాలు జరుగుతన్నాయని బెస్ట్ పోలీసింగ్ గా చెబుతున్న తెలంగాణ పోలీసులు ఎందుకు వీటిని అడ్డుకోవడం లేదన్నారు.
కొంత మంది పోలీసులు మామూళ్లు తీసుకొని వ్యభిచార గృహాలను ప్రోత్సహిస్తున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నడి రోడ్ల మీద కత్తులతో నరుకుతుంటే కనీసం స్పందించని సీఎం కేసీఆర్ అని ఖుష్బూ దుమ్మెత్తి పోశారు. జర్నలిస్టులను మోసం చేసిన ఘనత కూడా కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఇండ్ల స్థలాలని ఆశపెట్టి తన పాలనలో ఏ రోజు కూడా మాట్లాడని సీఎం కేసీఆర్ అన్నారు.
స్త్రీ శిశు సంక్షేమ శాఖకు కూడా మహిళ మంత్రిని నియమించని ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. కాంగ్రెస్ పార్టీ 11 మంది మహిళలకు టికెట్లు ఇస్తే టిఆర్ఎస్ నలుగురు మహిళలకు మాత్రమే టికెటించిదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మహిళా వ్యతిరేక సర్కార్ అని ఖుష్బు ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరల కొనుగోలులో 220 కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆమె విమర్శించారు. మహిళలు అంటే కేసీఆర్ కూతురు ఒక్కరేనా అని ప్రశ్నించారు. బతుకమ్మను తెలంగాణకు కవిత పరిచయం చేసిందా.. ఆమె లేకపోతే బతుకమ్మ లేదా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఏళ్లనాటి నుంచి ఉన్న బతుకమ్మను ఇష్టం వచ్చినట్టు చేశారని విమర్శించారు.
కేసీఆర్, మోడీ రిబ్బన్ కటింగ్ సీఎం, పీఎంలు గా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు అంటే కనీసం గౌరవం లేదన్నారు. గిరిజన భూములను కమిషన్ లతో కేసీఆర్ అమ్ముకున్నారు. గిరిజనులను చిత్రహింసలు పెట్టిన చరిత్ర కేసీఆర్ ది, మహిళలు అని చూడకుండా బట్టలు విప్పించి చెట్లకు కట్టేసిన గొప్ప ప్రభుత్వం టిఆర్ ఎస్ ప్రభుత్వం అన్నారు.
తెలంగాణ అభివృద్దిలో ముందంజలో ఉందని చెప్పటం హాస్యాస్పదం అన్నారు. అవినీతిలో దేశంలోనే రెండో స్థానంలో ఉండటం, నిరుద్యోగుల్లో 3 వ స్థానంలో ఉండటం అభివృద్దా అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజలకు మేమున్నామని చెప్పేది కేవలం కాంగ్రెస్ పార్టీనే అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని, ప్రజల బాగోగులు చూసేది కాంగ్రెస్సే అన్నారు. స్వయం సంఘాలకు లక్ష వరకు వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కాంగ్రెస్ 5 లక్షల రూపాయలు ఇస్తుందన్నారు. రేషన్ లో 9 రకాల వంట సరుకులు ఇస్తామన్నారు.
రైతులకు మద్దతు ధర అందించడంలో కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. రైతులకు బేడిలు వేసిన సర్కార్ దేశంలోనే తెలంగాణ సర్కార్ అని ఖుష్బూ గుర్తు చేశారు. మూడు వందల కోట్లు పెట్టి బంగ్లా కట్టుకున్న కేసీఆర్ కు స్వంత కారు లేదట అని ఎద్దేవా చేశారు.