టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం గజ్వేల్. ఇప్పుడు ఆయన పోటీ చేయబోతున్నది కూడా గజ్వేల్ నియోజకవర్గమే. ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తాకింది. టిఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలు గాంధీభవన్ వచ్చి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. గులాబీ పార్టీ నుంచి హస్తం పార్టీలో చేరిన ఆ నేతలెవరు? ఆ కథేంటి ? చదవండి.
గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవపూర్ ఎంపిపి రేణుక టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆమెతో పాటు ఇద్దరు ఎంపిటిసిలు, ఇద్దరు సర్పంచ్ (తాజా మాజీ) లు, ఇద్దరు తాజా మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ గూటికి చేరారు.
గులాబీ దళపతి కోటకు కాంగ్రెస్ తూటు పెట్టడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. కాంగ్రెస్ లో చేరినవారిలో ఎంపిపి రేణుక తోపాటు ఎంపిటిసిలు మమత భాను, కవిత యాదగిరి, కౌన్సిలర్లు భాగ్యలక్ష్మి దుర్గా ప్రసాద్ ఉన్నారు.
కేసిఆర్ తరచుగా విశ్రాంతి కోసం వెళ్లున్న ప్రదేశం అయిన ఫామ్ హౌస్ ఉన్న ఏరియా ఎంపిపియే కాంగ్రెస్ పార్టీలో చేరడం టిఆర్ఎస్ కు మింగుడు పడని అంశంగానే ఉన్నది. వీరందరికీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరంతా స్థానిక కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.
ఈ జాయినింగ్ సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే గజ్వెల్ లో ఒంటేరు ప్రతాప్ రెడ్డి గెలుపు ఖాయంగా కనిపిస్తున్నదని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం వీస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ గెలుపును అడ్డుకునేందుకు ఇప్పటి నుండే టీఆరెస్ డబ్బులు ,మద్యం పంచుతుందని ఆరోపించారు. కేసీఆర్ కుయుక్తులను ప్రతి కార్యకర్త తిప్పికొట్టాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్నాయని పునరుద్ఘాటించారు.
ఆత్మహత్యలు చేసుకున్న ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించని కేసీఆర్ కు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ స్వంత నియోజక వర్గం నుండే పెద్ద ఎత్తున చేరికలే టీఆరెస్ ఓటమి కి నాంది పలుకుతున్నాయని జోస్యం చెప్పారు.
గజ్వేల్ లో పట్టు బిగిస్తున్న ప్రతాప్ రెడ్డి
ముఖ్యమంత్రి మీద పోటీ అంటే ఎవరైనా జడుసుకుంటారు. పక్క సీట్లలోకి పారిపోతారు. సేఫ్ సీటు కోసం పాకులాడతారు. కానీ ఒంటేరు ప్రతాపరెడ్డి మాత్రం అదరలేదు.. బెదరలేదు. గతంలో కేసిఆర్ గజ్వేల్ లో పోటీ చేయబోతున్నాడని తెలియగానే అప్పుడు ఒంటేరు టిడిపిలో ఉన్నారు. అయినా సరే కేసిఆర్ ను ఎదుర్కొనే సత్తా నాకుంది కమాన్ కేసిఆర్ అంటూ సవాల్ చేశారు. ఎదురు నిలబడ్డారు. సర్వ శక్తులు ఒడ్డినా కేసిఆర్ అత్తెసరు ఓట్లతోనే గెలిచారు. 20వేలు మాత్రమే కేసిఆర్ మెజార్టీ సాధించగలిగారు.
ఈ పరిస్థితుల్లో ఈసారి కూడా తాను కేసిఆర్ మీదే పోటీ చేస్తానని ప్రతాప్ రెడ్డి రెడీ అయ్యారు. అయితే కేసిఆర్ గజ్వేల్ రాగానే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి కేసిఆర్ కు జీ హుజూర్ అంటూ కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరిపోయారు. కేసిఆర్ గెలుపు కోసం పనిచేశారు. గత ఎన్నికల్లో అటు టిఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, రెండు పార్టీలకు చెందిన ఓట్లతో కేసిఆర్ గట్టెక్కారు.
కానీ ఈసారి టిడిపి ఓట్లు, కాంగ్రెస్ ఓట్లు ప్రతాప్ రెడ్డికే అనుకూలంగా ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో జగ్వేల్ లో గతం కంటే మరింత టైట్ గా ఎన్నికలు ఉండే చాన్స్ ఉందంటున్నారు. అధికారం లేకపోయినా నాలుగున్నరేళ్ల కాలంలో ఒంటేరు ప్రతాప్ రెడ్డి కేసిఆర్ కు దాసోహమనలేదు. ఫైట్ చేస్తూనే ఉన్నాడు. ఓయులో అరెస్టు చేసి జైలుపాలు చేసినా ఆయన తగ్గలేదు.
చేరిన నేతలు వీరే
జగదేవపూర్ ఎంపిపి ఎర్ర రేణుకా యాదగిరి
ఎంపిటిసి లు
మమతా భాను
కవితా యాదగిరి
ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్
ఏల్లోల్ల ఐలయ్య
ములుగు మండల్ కోత్యాల తాజమాజి సర్పంచ్
విజయ్
సీనియర్ నాయకులు
రామక్రిష్ణ పంతులు
సుదర్శన్ రెడ్డి
నర్శిమ్హా రెడ్డి
గోపాల్ రెడ్డి