గన్ మెన్ ను తిప్పిపంపిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రవణ్ దాసోజు

ప్రజలే నాకు రక్షణ అంటున్న  శ్రవణ్ దాసోజు

ఖైరతాబాద్ నియోజకవర్గ మహాకూటమి నుంచి కాంగ్రెస్  ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ శ్రవణ్ దాసోజుకు రక్షణగా ప్రభుత్వం కేటాయించిన గన్ మెన్ లను  డాక్టర్ శ్రవణ్ దాసోజు తిప్పిపంపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖైరతబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న శ్రవణ్ దాసోజుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నరు. ఈ సందర్భంగా శ్రవణ్ దాసోజు మాట్లాడుతూ దశాబ్ద కాలంగా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక వహించి, ప్రజా సమస్యలపై నిరంతర పోరాడుతున్న తనకు ప్రజలు అండగా ఉన్నారని తెలిపారు. లక్షల రూపాయల జీతం వచ్చే ప్రభుత్వం ఉద్యోగాన్ని వదులు కొని ప్రజా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఖైరతబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా తనను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని,  ప్రజలను వంచించిన చింతల రాంచంద్రారెడ్డి,  దౌర్జన్యాలు చేస్తున్న దానం నాగేందర్ లను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు.

దౌర్జన్యాలు దందాలు,మోసాలు చేసేవారికే పోలీసుల రక్షణ అవసరముంటుందన్నారు. ఖైరతాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో అన్ని ప్రధాన ప్రాంతాల్లో స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యతతో నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. దివంగత నేత పేదల పెన్నిది నిత్యం ప్రజల మధ్యనే జీవించిన పీజేఆర్ ఆశయాలను నెరవేర్చడానికి కృషిచేస్తున్న తనకు ప్రజలే అండగా నిలుస్తారని, ప్రత్యేక భద్రత అవసరం లేదని స్పష్టం చేశారు.