కాంగ్రెస్ పార్టీ అనగానే అంతర్గత ప్రజాస్వామ్యం కాసింత ఎక్కువ అన్న డైలాగ్ వినబడుతుంటది. ఆ అంతర్గత ప్రజాస్వామ్యం ఒక్కోసారి శృతిమించి కొన్నిసార్లు గడబిడలు జరుగుతుంటాయి. తాజాగా రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా రెండోరోజు మీటింగ్స్ లో గడబిడలు జరిగాయి. రాహుల్ తొలిరోజు పర్యటన విజయవంతంగా సాగింది. మహిళలతో ఇంటరాక్షన్, ఒక బహిరంగ సభలో రాహుల్ పాల్గొన్నారు. తొలిరోజు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు కాంగ్రెస్ నేతలు. కానీ రెండోరోజు కాంగ్రెస్ మార్కు పాలిటిక్స్ జరిగాయి. రాహుల్ తో ఎడిటర్స్ మీటింగ్ మొదలు కొని సీనియర్ల మీటింగ్, విద్యార్థి నేతల మీటింగ్ లో ఏం జరిగిందో టూకీగా కింద చదవండి. (విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ఆధారంగా…)
ఎడిటర్స్ మీటింగ్ లో జానారెడ్డి వేదిక మీదకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఆయన పేరు లేదని చెప్పడంతో ఆయన అలిగి బయటకు వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. ఇంతలో పార్టీ నేత గూడూరు నారాయణరెడ్డి బతిలాడి లోపలికి తీసుకుపోయారు.
సీనియర్ల మీటింగ్ లో ఇటీవల పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి కి పాస్ నిరాకరించారు. ఆయనను సీనియర్ లీడర్ గా గుర్తించకపోవడం వివాదాస్పదమైంది.
సీనియర్ లీడర్ల మీటింగ్ జాబితాలో తన పేరు లేకపోవడంతో మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డి బాధపడి కంటతడి పెట్టారు.
రెండు వర్గాల గొడవ కారణంగా ఉస్మానియా విద్యార్థులతో జరగాల్సిన భేటీ వాయిదా పడింది. ఈ భేటీకి కొందరికి అనుమతి లేదనడం తో రెండు వర్గాలుగా విడిపోయి హోటల్ లోపల ఓయూ విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ వివాదంలో కొందరు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ బ్యాచ్ గా మరికొందరు రేవంత్ రెడ్డి బ్యాచ్ గా చీలిపోయారు. వసూల్ బ్యాచ్ అని ఒక వర్గం వారు మరో వర్గం వారిని విమర్శించడంతో వివాదం చెలరేగింది. దీంతో భేటీ తొలుత పోస్టు పోన్ అయి మధ్యాహ్నం తర్వాత జరిగింది.