దేశంలో కరోనా విజృంభణ యధేశ్చగా కొనసాగుతోంది. నేటితో కేంద్రం విధించిన లాక్ డౌన్ కూడా ముగిసింది. ఇక లాక్ లేనట్లే. కొన్నింటిపై మాత్రం ఆక్షలు కొనసాగుతాయి. అలాగే కేసులు ఉన్న చోట ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటాయి. పనులకు వెసులుబాటు కల్పించినా వైరస్ మహమ్మారికి భయపడి బయటకు వచ్చే పరిస్థితి లేదు. నేడు ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. పేదల కోసం గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద ఉచిత రేషన్ అందిస్తున్నామన్నారు. ఈ పథకాన్ని నవంబర్ 2020 వరకూ పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. దేశంలో మూడేళ్లకు సరిపడ ఆహార నిల్వలున్నాయని, ఇదే మనకి కలిసివచ్చే అంశమన్నారు.
ఇలాంటి విపత్కర సమయంలో ఈ నిల్వలు మనకు ఎంతగానో తాడ్పాటును ఇస్తాయన్నారు. అయితే సరిగ్గా మోదీ చేసిన ప్రకటన కాసేపటికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. బెంగాల్ లో రేషన్ ను వచ్చే ఏడాది 2021 జూన్ వరకూ ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. కరోనా కేసులు పెరగడాన్ని బట్టే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మమత తెలిపారు. దీంతో బెంగాల్ సీఎంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అయితే మోదీ చేసిన ప్రకటన తర్వాతే మమత ప్రకటించడం పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో పరిస్థితిని మోదీకి వివరించేందుకే మమత ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయాన్ని దేశంలో ఇంకెన్ని రాష్ర్టాలు సీఎంలు ఆదర్శంగా తీసుకుంటారంటూ ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది. ముఖ్యంగా పాలన విషయంలో దూసుకుపోతున్న తెలుగు రాష్ర్టాల సీఎంలు కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి డేరింగ్ డెసిషన్లు తీసుకునే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. తెలుగు రాష్ర్టాల్లో అమలవుతోన్న సంక్షేమ పథకాల నేపథ్యంలోనే సీఎంలపై పలువురు నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.