హైదరాబాద్‌లో కొత్త సంవత్సరం వేడుకలపై ఇప్పటికే నిషేధం విధించారు. కరోనా నేపథ్యంలో ఎలాంటి వేడుకలకు అనుమతి లేదని తేల్చేశారు. మరోవైపు ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. సైబర్ టవర్స్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, జేఎన్టీయూ, మైండ్ స్పేస్ ఫ్లై ఓవర్స్, దుర్గం చెరువు తీగల వంతెనను మూసివేయనున్నారు.
బేగంపేట ఫ్లైఓవర్ మినహా అన్ని ఫ్లై ఓవర్లను మూసివేయాలని పోలీసులు నిర్ణయించారు. మరోవైపు ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్టెస్ రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ ప్రాంతాల్లో రాత్రి 10 గంటల నుంచి రేపు ఉదయం వరకు వాహనాల రాకపోకలను నిషేధించారు. నిబంధనలను ఎవరూ అతిక్రమించవద్దని పోలీసులు స్పష్టం చేశారు.
మరోవైపు డిసెంబర్ 31కి ముందు నుంచే నగరంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తాగి మద్యం నడిపి, తమతో పాటు ఇతరుల ప్రాణాలను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సైబరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే పదేళ్ల జైలు శిక్ష పడేలా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇక హైదరాబాద్‌లో కొత్త సంవత్సర వేడుకలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు అనుమతి లేదని స్పష్టం చేసింది. పబ్‌లు, క్లబ్బులు, బార్లకు పర్మిషన్ లేదని తెలిపింది.