కేసీఆర్ ముక్కు కోసి చేతిలో పెడుతా : బైరెడ్డి వార్నింగ్

ఆర్డీఎస్ ను అడ్డుపెట్టుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యంతరకరమైన భాషను వాడుతున్నారని ఏపీ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి విమర్శించారు. ఆలంపూర్ సభలో ‘ఒరేయ్, బైరెడ్డి, నా కొడకా’ అంటూ చెప్పిన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

తెలంగాణలో తనకు ఎంతోమంది బంధువులు, స్నేహితులు ఉన్నారని వ్యాఖ్యానించారు. రాజకీయ అవసరాల కోసం ఇరు రాష్ట్రాల మధ్య తెలంగాణ సీఎం తగాదాలు పెడుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ నోటిని అదుపులో పెట్టుకోవాలనీ లేదంటే ముక్కు కోసి చేతిలో పెడతానని వార్నింగ్ ఇచ్చారు.

కర్నూలులో బైరెడ్డి మీడియాతో మాట్లాడారు.. ఆయన ఏమన్నారంటే…  

‘తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో నా బంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఎందరో ఉన్నారు. వారితో మంచిగానే ఉంటున్నా. కేసీఆర్  ఈ రోజు ఓట్ల కోసం తగాదాలు పెట్టకు. రాయలసీమ రైతుల పొట్ట కొట్టొద్దు.  నీకసలు శ్రీశైలం, ఆర్డీఎస్‌ అంటే తెలుసా? శ్రీశైలం ప్రాజెక్టు ముంపు కింద మహబూబ్‌నగర్‌, కర్నూలు జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోయారు. రెండు జిల్లాల్లో నష్టపోయిన రైతులందరికి నందికొట్కూరులో సభ ఏర్పాటు చేసి ప్రధానమంత్రి సమక్షంలో చెక్‌లు ఇప్పించాను.

కర్ణాటకలోని మాన్విలో జలదోపిడీ జరుగుతుంటే మాపై పడి ఏడుపు ఎందుకు? వాళ్లు తంతారని భయపడి మాపై నీచమైన వ్యాఖ్యలు చేయకు. ఎన్నికల్లో ఎలాగూ నీకు ఓటమి తప్పదు. అప్పుడు బహిరంగ చర్చకు రా.. నా ప్రాంత రైతులతో నేనూ వస్తా. ఆర్డీఎస్‌ విషయంలో ఎక్కడ అన్యాయం జరుగుతోందో తేల్చుకుందాం.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయాన కూడా రాయలసీమను తెలంగాణలో కలపాలని మేం డిమాండ్ చేశాం. ఆ విషయాన్ని మర్చిపోయావా కేసీఆర్. బాంబులు వేస్తావా.. మేమెన్నడు కూడా బాంబులు వేస్తామని బెదిరించలేదు. ప్రశాంతంగా ఉన్న ప్రజలల్లో విద్వేశాలు రెచ్చగొట్టకు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు.

ఎన్నికలలో లబ్ది పొందడం కోసం ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం. రాజ్యాంగ పదవిలో ఉండి ఏం మాట్లాడుతున్నావో తెలుసా నీకు… అరేయ్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.. బిడ్డా తొక్కుతా… తొక్కుడు తొక్కితే అడ్రస్ లేకుండా పోవాలి అంటూ మాట్లాడావ్. అసలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్ధమవుతుందా కేసీఆర్. బుద్ది ఉండాలి. ఎన్నికలలో ఓడిపోతా అని తెలిసి ఈ విధంగా వ్యవహరిస్తున్నావు.

కేసీఆర్ నీవు మాట్లాడిన భాషను వెంటనే వెనక్కు తీసుకో లేకుంటే బాగుండదు. ఇన్ని రోజులుగా గుర్తుకు రానిది ఇప్పుడే గుర్తుకు వచ్చిందా.. కర్ణాటకలోని మాన్వి ప్రాంతంలో జలదోపిడి జరుగుతుంది. దమ్ముంటే అక్కడకు నువ్వు రా… మేము కూడా వస్తాం. అక్కడ జరుగుతున్న జలదోపిడి అడ్డుకుందాం.

మహబూబ్ నగర్ జిల్లా వడ్డేపల్లి మండలం తుమ్మిళ్ల వద్ద అక్రమంగా నీటిని తరలించేందుకు 750 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ను నిర్మిస్తున్నది వాస్తవమా కాదా అనేది కేసీఆర్ చెప్పాలి. కేసీఆర్ తరహాలో కొడకా.. అంటూ తాను దిగజారి వ్యాఖ్యలు చేయను. కేసీఆర్ నోటిని అదుపులో పెట్టుకోకపోతే ముక్కు కోసి చేతిలో పెడుతా” అంటూ బైరెడ్డి కేసీఆర్ ను హెచ్చరించారు.