తెలంగాణ బోనాలు గరం గరం… స్వర్ణలత ఆగ్రహం

తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇప్పటివరకు బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. తెలంగాణ సర్కారు బోనాలు, బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్ర పండుగలుగా గుర్తించి ప్రాధాన్యత ఇచ్చి జరుపుతున్నది. తొలి నాలుగేళ్లు బాగానే సాగాయి బోనాల పండుగలు. కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. కానీ ఈసారి బోనాలు గరం గరం అయ్యాయి. బోనాల పండుగ అంటేనే అందరికీ గుర్తొచ్చేది సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి తల్లికి పెట్టే బోనాలు. వేలు, లక్షల మంది సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పిస్తారు. తొలినాళ్లలో వైభవంగానే ఉజ్జయినీ ఉత్సవాలు జరిగాయి. కానీ ఈ ఏడాది ఎందుకో కానీ బోనాలు పండుగ గతంలా కాకుండా గరం గరంగా సాగాయి. సోమవారం రంగం (భవిష్యవాణి) చెప్పిన మాతంగి స్వర్ణలత గత నాలుగేళ్లలో ఎన్నడూ లేనంతగా తెలంగాణ సర్కారు మీద గరం అయ్యారు. బంగారు బోనం తనకు సంతోషంతోపాటు బాధను కూడా కలిగించిందని స్వర్ణలత రంగం చెప్పారు. అంతేకాదు ప్రజలందరినీ సంతోషంగా ఉంచాలని ఆకాంక్షించారు. మీరు ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు.. నా బిడ్డలను ఇబ్బంది పెట్టొద్దు అంటూ స్వర్ణలత రంగం సాగింది.

ఆదివారం బోనాల ఉత్సవాల్లో భాగంగా సిఎం కేసిఆర్ ఉజ్జయినీ మహాంకాళీ తల్లికి బంగారు బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు ఎంపి కవిత, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపి సంతోష్ కుమార్ తదితర విఐపీలంతా పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సామాన్య భక్తులను క్యూ లైన్లో ఉంచారు. వీరితోపాటు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తదితర విఐపిలు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. విఐపిలు వచ్చిన సందర్భంలో మహిళా భక్తులను గంటల తరబడి క్యూ లైన్లోనే నిలబటెట్టారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఏకంగా జోగిని శ్యామల ఈ విషయంలో సీరియస్ అయ్యారు. కంట తడి పెట్టారు. తెలంగాణ సర్కారుపై శాపనార్థాలు పెట్టారు. ఈ ప్రభుత్వం కూలిపోతుందంటూ శపించారు.

ఇదిలా ఉంటే సోమవారం భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత కూడా ఈసారి స్వరంలో మార్పు వచ్చింది. గత ఏడాది తెలంగాణ సిఎం కేసిఆర్ పాలన బాగుందని కొనియాడారు. కేసిఆర్ ను కోట్లకు పడగలెత్తిస్తా అని ఆశీర్వాదాలు ఇచ్చారు. అమ్మవారి ఆశీర్వాదాలు గత ఏడాది అందుకున్న నేపథ్యంలో ఈసారి సిఎం కేసిఆర్ అమ్మవారికి బంగారు బోనం చేయించి కుటుంబంతో సహా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించారు. అయినా స్వర్ణలత మాత్రం భవిష్యవాణిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు బోణం కొద్దిగానే సంతోషం ఇచ్చిందన్నారు. కొంత బాధను కూడా మిగిలించిందన్నారు. ఇక్కడ ఇంత మంది సిబ్బంది ఉన్నా ఆడబిడ్డలు నిన్న ఇబ్బంది పడ్డారు అని స్వర్ణలత ఆగ్రహించారు. నా భక్తులంతా సంతోషంతో నాదగ్గరకు రావాలి కానీ బాధతో వస్తున్నారు. నా ఆడబిడ్డలు బాధపడే పరిస్థితి వచ్చింది. ఆడపడుచులు నా బిడ్డలే. వారు సంతోషంగా రావాలి. అని స్వర్ణలత జోస్యం చెప్పారు.

మాతంగి స్వర్ణలత రంగంలో ఈ అంశాలను వెల్లడించారు. 

బంగారు బోనం సమర్పించామని మీరు సంతోష పడుతున్నారు..కానీ నాది నాకే సమర్పించారు.

నాకు ఎవ్వరూ బంగారు బోనం పెట్టలేదు…నాది నేనే తెచ్చుకున్నాను.

బంగారు బోనం సమర్పణ జరిగినా..నేను దుఃఖంతో ఉన్నాను.

నా సన్నిధికి వస్తున్న భక్తులు దుక్కం తో వస్తున్నారు… దుక్కంతోనే పోతున్నారు.

దేవాలయానికి వచ్చే భక్తులందరూ దుఃఖంతో పోతున్నారు.

ఈ ఏడాది మాత్రం భక్తులు సంతోషంగా లేరు..దుఃఖంతో వెళ్తున్నారు.

భక్తులు సంతోషంగా ఉన్నారని మీరు మాత్రమే అనుకుంటున్నారు.. కానీ భక్తులందరూ దుఃఖంతో వెళ్తున్నారు.

మాటల్లో ఉన్నంత…చేతల్లో మాత్రం పనులు లేవు.

నా బిడ్డలు అడపడుచులందరు ఏడుపులతో ఉన్నారు.

మీరు ప్రజలను ఇబ్బంది పెట్టినా.. నేను మాత్రం గ్రామ ప్రజలను సంతోషంగా చూసుకుంటాను.

ప్రజలకు మేలు చేస్తున్నారు అనుకుంటున్నారు..కానీ మీరు కీడు చేస్తున్నారు.

ప్రజలందరూ శాపాలు పెడుతున్నారు…నేను ఎప్పుడు శాపం పెట్టలేదు.

ప్రజలను సంతోషం గా చూసుకుంటాను. ఆ భాద్యత నాది.

నా ఆశీర్వాదం అందరికి ఉంటుంది…నాకు మాత్రమే మొక్కులు పెట్టడం కాదు.. ప్రజలను సంతోషపెట్టండి.

వచ్చే రోజుల్లో నా భక్తులకు ఇబ్బందులు కాకుండా చూసుకోండి.

న్యాయం ఉన్నంత వరకు నేను న్యాయం పక్షాన్న నిలబడుతా..

కొరినన్ని వర్షాలు ఉన్నాయి..వచ్చే రోజుల్లో వర్షాలు కురుస్తాయి.

పాడి పంటలు బాగా పండుతాయి…

నాకు ఎంత బంగారం పెట్టినా..ప్రజలందరూ సుఖంగా ఉంటేనే నాకు సంతోషం.