తెలంగాణ బిజెపిలో కలవరం : ఎమ్మెల్యే రాజీనామా

తెలంగాణ బిజెపిలో ఊహించని కలవరం చోటు చేసుకుంది. ఆ పార్టీకి చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం రాజా సింగ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత నాలుగు రోజుల క్రితమే తన రాజీనామా లేఖను పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ కు పంపించారు. రాజాసింగ్ రాజీనామా ఎందుకంటే? చదవండి.

రాజా సింగ్ గత కొంత కాలంగా బిజెపి పార్టీకి అంటిముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. కీలకమైన విషయాల్లో తప్ప ఆయన బిజెపి తెలంగాణ అగ్ర నాయకత్వంతో సఖ్యతగా లేరు. అసెంబ్లీలోనూ ఆయన ఓటింగ్ లాంటి అంశాల్లో తప్ప నాయకులతో టచ్ లో ఉండడం లేదు. గో రక్షణ ఉద్యమానికి, బిజెపి పార్టీకి కొందరు లింక్ పెడుతూ విమర్శలు చేస్తున్నారని తనకు గో రక్షణ మాత్రమే ముఖ్యమనే ఉద్దేశంతో తన ఎమ్మెల్యే పదవికి రాజా సింగ్ రాజీనామా చేశారు.

గో రక్షణ కోసం తాను దేనికైనా సిద్ధమేనని రాజా సింగ్ ప్రకటించారు. గో రక్ష ఉద్యమానికి, బిజెపి పార్టీకి ఏ రకమైన సంబంధం లేదని స్పష్టం చేశారు. అక్రమ గో రవాణాను అడ్డుకునేంత వరకు తన పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం అక్రమ గో రవాణాను అడ్డుకోకపోతే తానే రంగంలోకి దిగుతానని హెచ్చరించారు. అవసరమైతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పరిస్థితి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. మజ్లిస్ పార్టీ చేతిలో తెలంగాణ సిఎం కేసిఆర్ కీలుబొమ్మ లా మారిపోయారని విమర్శించారు. గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాలను కొందరు లంచాలు తీసుకుని వదిలేస్తున్నారని రాజా సింగ్ మండిపడ్డారు.

గతంలోనూ రాజీనామా ప్రయత్నం

గతంలో ఒకసారి రాజా సింగ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రయత్నం చేశారు. అయితే అప్పట్లో తన రాజీనామాను ముఖ్యమంత్రి కేసిఆర్ కు అందజేస్తానని ప్రగతి భవన్ కు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. తన నియోజకవర్గంలో సమస్యలు పట్టించుకోవడంలేదు కాబట్టి సిఎం అపాయింట్ మెంట్ ఇస్తే ఆయనకే రాజీనామా లేఖను అందజేస్తానని రాజా సింగ్ ప్రకటించారు. కానీ సిఎం కేసిఆర్ అపాయింట్ మెంట్ దొరకలేదు.

ఇప్పుడు రాజీనామాను నేరుగా స్పీకర్ కు పంపకుండా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి పంపడం బిజెపి వర్గాల్లో చర్చనీయాంశమైంది. గో రక్ష ఉద్యమానికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే రాజా సింగ్ రాజీనామాను పార్టీకి పంపారని చెబుతున్నారు. దీనిపై పార్టీ నాయకత్వం ఎలా రియాక్ట అవుతుందో మరి?