గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి తన ఘాటు వ్యాఖ్యలతో రాజకీయ వర్గాలను ఉలిక్కిపడేశారు. ఎంఐఎంతో చేతులు కలుపుకున్న కాంగ్రెస్ పార్టీలోకి తనకు అడుగు పెట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేస్తూ, పార్టీ మార్పు వార్తలకు పూర్తి స్థాయిలో తెరదించారు. తాను బీజేపీ నాయకత్వం చెప్పిందే చేస్తాను. అవసరమైతే ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేయడానికి సిద్ధం. గోషామహల్‌లో ఉప ఎన్నిక జరిగితే కూడా నాకు ఏమాత్రం అభ్యంతరం లేదు అని బహిరంగంగానే ప్రకటించారు.
లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆలయంలో రాజాసింగ్‌కు స్వాగతం ఫలికారు.. అనంతరం ఆలయ నిర్వాహకులు పట్టు వస్త్రాలు ఇచ్చి, ఆశీర్వదించారు. అమ్మవారి ఆశీస్సులతోనే గోషామహల్‌కి సేవ చేస్తున్నానని ఈ సందర్భంగా రాజా సింగ్ అన్నారు. గోశాల నిర్మాణానికి మంత్రులు సహాయం అడిగారు. మోడల్ గోశాల ఏర్పాటుకు ఎల్లవేళలా సహకరిస్తా. ఏ పార్టీ ఉన్నా ప్రజలకు సేవ చేయడమే అసలైన లక్ష్యమని పేర్కొన్నారు. గోషామహల్‌లో ఆలయాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దాలి. ఇది నా వ్యక్తిగత ప్రయత్నం కాదు. గత ప్రభుత్వాలు ఆలయాలను రాజకీయంగా వాడుకున్నాయి. ఇప్పుడు అయినా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని అమ్మవారి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించాలి’’ అని అన్నారు.
అదే సమయంలో బోనాల సంస్కృతిని కొందరు తక్కువ చేయాలని కుట్ర చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అలాంటి వాళ్లకు తగిన శిక్ష తప్పదని రాజాసింగ్ హెచ్చరించారు. ‘‘బోనాలు మద్యం పండుగ కాదు. ఇది మన మహిళల భక్తి, మన సంప్రదాయం. దీన్ని తక్కువ చేసి చెప్పే వారు బోనాల ఆధ్యాత్మికతను భ్రష్టు పట్టిస్తారు. అలాంటి వాళ్లను బహిరంగంగా ఎదుర్కొంటా’’ అని సూటిగా చెప్పారు.
తన రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ తాను పార్టీ మారుతానని ఎవరు ఊహిస్తున్నారో, వాళ్లకు ఇది సమాధానం. బీజేపీ అధిష్టానం చెప్పినట్టే చేస్తాను. గోషామహల్ అంటేనే బీజేపీ కంచుకోట. ఉప ఎన్నికైనా భయపడేది లేదు. గోషామహల్‌లో ఎవరు పోటీ చేసినా తనకు లెక్కే లేదు. తనకు మద్దతుగా ఉన్న ప్రజలే నా బలం అని ధీమాగా చెప్పారు.
కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర నేతలతో రాజాసింగ్‌కు విబేధాలు ఉన్నట్టు, పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వర్గాలు చెబుతున్నాయి. జూన్ 30న ఆయన పార్టీకి రాజీనామా చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆయన తాజా వ్యాఖ్యలతో బీజేపీలోనే కొనసాగుతారని, పార్టీ తుది నిర్ణయం మేరకే అడుగులు వేస్తారని చెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది.
