గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను బీజేపీ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. దుబ్బాక ఉపఎన్నిక విజయస్ఫూర్తిని జీహెచ్‌ఎంసీలోనూ కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ ఎన్నికలకు వ్యూహాత్మక అజెండా రూపొందిస్తూ అన్ని పార్టీలనూ అందులోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు కమలనాథులు.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ ఎలాగైనా ఈ ఎన్నికల్లో సత్తా చాటి పార్టీ జాతీయ నాయకత్వం నుంచి ప్రశంసలు పొంది రాష్ట్రంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. అందుకోసం తన రాజకీయ ప్రకటనలు, సవాళ్లలో ఘాటుదనం ఎక్కువుండేలా సంజయ్ చూసుకుంటున్నారు. సంజయ్ విసురుతున్న సవాళ్లకు టీఆర్ఎస్, మజ్లిస్ జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఏళ్లుగా తెలంగాణ బీజేపీకి నాయకత్వం వహించిన కిషన్‌రెడ్డిగాని, లక్ష్మణ్‌గాని ఈ స్థాయిలో దూకుడు ప్రదర్శించలేదు.
వాస్తవానికి ఇప్పటి వరకు తెలంగాణలో జరిగిన అన్ని ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంటే కీలక అంశంగా ఉండేది. తెలంగాణ ద్రోహులు, ఆంధ్రా నాయకులు అనే మాటలు బాగా వినిపించేవి. కాని, ఇప్పుడా సెంటిమెంట్ ఎక్కడా కనిపించడం లేదు. అలాగే అది వర్కౌట్ అయ్యే పరిస్థితి కూడా లేదు. తెలంగాణ సెంటిమెంట్ రంగరించి టీఆర్‌ఎస్ అస్త్రాలకు చిక్కుకుని ఇతర పార్టీలు అప్పట్లో తల్లడిల్లేవి. కాని ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. బీజేపీ సెట్ చేసిన అజెండాలో మిగిలిన పార్టీలు నడుస్తున్నాయా అనే భావన కలుగుతోంది.
2016లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ తమ ప్రధాన ప్రత్యర్థి అని గులాబీ నేతలు ప్రకటించారు. కాని, ఈసారి బీజేపీ సెట్ చేసిన అజెండాలో చిక్కుకొని ఇన్నాళ్లు తమ మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్ ఈ ఎన్నికల్లో తమ ప్రత్యర్థి అని చెప్పుకునే స్థితికి వచ్చారు టీఆర్‌ఎస్ నాయకులు. ఇది నిజంగానే ప్రజల్లో పార్టీని పలుచున చేసింది.
నగర ప్రజలకు ఏం చెప్తే ఆకర్షితులవుతారో గ్రహించిన బీజేపీ ఆ మాటలే పదేపదే చెప్తోంది. అందులో భాగంగానే టీఆర్ఎస్, మజ్లిస్ మధ్య పొత్తు ఉందని, ఎన్నికల తర్వాత మజ్లిస్ కార్పొరేటర్ మేయర్ అవుతారని అంటోంది. దీంతో మజ్లిస్‌తో తమకు ఎటువంటి పొత్తు లేదని ఓటర్లకు చెప్పేందుకు కేటీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో అటు అసదుద్దీన్ ఒవైసీ కూడా టీఆర్‌ఎస్‌ను ఓడిస్తామని ప్రచారం చేస్తున్నారు.
ప్రత్యర్థిగా తమను టీఆర్‌ఎస్ అంగీకరించడంతో తాము సగం గెలిచినట్టేనని కమలనాథులు భావిస్తున్నారు. మరి, ఈ మాత్రానికే సంతోషించి ఊరుకుంటారా, లేదా నిజంగానే గ్రేటర్ ఓటర్లను ఆకట్టుకుంటారా, చూడాలి డిసెంబర్ 1న ఏం జరుగుతుందో?