కేసీఆర్ తెరాసను రెండు ముక్కలు చేస్తారట.. ఏం మాట్లాడుతున్నారు ?

BJP fake propaganda on TRS
తెలంగాణ బీజేపీ రోజుకో కొత్త వ్యూహాన్ని అమలుచేస్తోంది.  అధికార పక్షాన్ని ఢీకొట్టడానికి ఎన్ని దారులున్నాయో అన్ని దారులు వెతుకుతోంది.  అన్ని రాజకీయ పార్టీలతో పోలిస్తే బీజేపీకి ప్రత్యేకమైన క్వాలిటీ ఒకటుంది.  అదే ఫేక్ ప్రచారం.  ప్రచారంతోనే ప్రభుత్వాల పునాదులను కదిల్చిన చరిత్ర ఉంది బీజేపీకి, అదిగో పులి.. ఇదిగో తోక అనే భ్రమపూరితమైన ప్రచారం చేయడంలో కాషాయ దళం బహి నేర్పరి.  ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా చోట్ల ఈ విధానాన్ని అమలుచేసి  ప్రయోజనం పొందింది బీజేపీ.  ఇప్పుడు ఈ తరహా ప్రచారాన్నే తెలంగాణలో కూడ అమలుచేస్తోంది.  అందుకు నిదర్శనమే ఆదివారం బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు.  
 
BJP fake propaganda on TRS
BJP fake propaganda on TRS
కేసీఆర్ వచ్చే ఎన్నికల నాటికి కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని  చేసేస్తారని, ఎన్నికల్లో సీఎం అభ్యర్థి కేటీఆరేనని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.  కేసీఆర్ ఎక్కువగా ఫాల్ హౌస్లోనే ఉంటూ పాలన మొత్తాన్ని కేటీఆర్ చేతికి అప్పగించడం ఇందుకు బలాన్ని చేకూర్చింది కూడ.  కానీ గత కొన్ని నెలలుగా మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కేసీఆర్ మళ్ళీ పనిలోకి దిగారు.  ఇప్పుడు ఆయన ముందున్న ఏకైక లక్ష్యం వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడం.  అప్పటికి ఆయనే సీఎం అభ్యర్థిగా ఉంటారా లేకపోతే కుమారుడ్ని నిలబెడతారా అనేది తేలాల్సి ఉంది.  
 
కానీ బీజేపీ మాత్రం కేసీఆర్ కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయబోరని ఖచ్చితంగా  చెబుతున్నారు.  దానికి సంబంధించి తనకు బలమైన సమాచారం ఉందని అంటున్నారు.  ఈ వ్యాఖ్యలతో కేటీఆర్ సామర్థ్యం మీద తండ్రి కేసీఆర్ కే నమ్మకం లేదని చెప్పాలనేది బీజేపీ భావన.  ఇదంతా ఫ్యూచర్ ప్లాన్ మరి.  కాస్త ముందైనా,వెనకైనా తెరాస పగ్గాలు చేపట్టబోయేది కేటీఆరే అనేది నిజం.  కాబట్టి ఇప్పటి నుండే ఆయన్ను జనంలో పలుచన చేయాలని చూస్తున్నారు బీజేపీ నేతలు.  అందుకే కేటీఆర్ సీఎం కాడని అంటున్నారు.  అంతేకాదు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కొత్త పొలిటికల్ పార్టీని తెరమీదకు తెస్తారని కూడ అంటున్నారు.    
 
తెరాస నుండే కొందరు ముఖ్యమైన లీడర్లను బయకు పంపి వారి చేత కొత్త పార్టీ పెట్టించి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలుస్తారని, ఇది బీజేపీ ఓటు బ్యాంకుకు గండికొట్టే ప్రయత్నమని అంటున్నారు.  క్లుప్తంగా చెప్పాలంటే కేసీఆర్ తెరాసను రెండు ముక్కలు చేస్తారని చెబుతున్నారు.  అసలు ఏ నాయకుడైనా  సొంత పార్టీని చీల్చుకుని వేరొక పార్టీని పెట్టే సాహసం చేస్తారా ? దేశంలో ఎప్పుడైనా ఇలాంటిది జరిగిందా ? ఆత్మహత్య సాదృశ్యం లాంటి ఈ పనిని ఏ నాయకుడైన చేస్తాడా ? కానీ బండి సంజయ్ మాత్రం కేసీఆర్ తెరాసను ముక్కలు చేయబోతున్నారని నమ్మశక్యం కాని మాటలు చెబుతున్నారు.  ఇవన్నీ ప్రజల్లో లేనిపోని భ్రమలు కల్పించడం కాకపోతే మరేమిటి.