నిన్నటి వరకు ఆమె ఎన్నారై. తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడిప్పుడే అడుగు పెట్టారు. ఆమెకు రాజకీయ అనుభవం గోరంతే కానీ.. కొండనే ఢీకొట్టబోతున్నారు. ఆమెలో ఏమాత్రం భయం బెరుకూ లేవు. కొండను ఢీకొడుతున్నానని తెలుసు… అయినా విజయం సాధిస్తానన్న ధీమాతో ఉన్నారు. గెలుపోటములు ఎలా ఉన్నా ఆమె సాహసోపేతమైన పోరాటం చేస్తున్నారు. ఇంతకూ ఎవరా ఎన్నారై ఏమా కథ? అవతలిపక్షంలో ఉన్న కొండ ఎవరు? చదవండి స్టోరీ.
ఈమె పేరు భవానిరెడ్డి. పుట్టింది సిద్ధిపేట జిల్లాలోని నాగిరెడ్డిపల్లె. చదివింది సిద్ధిపేట, హైదరాబాద్ లలో. ఉద్యోగం చేసింది సిద్ధిపేట, ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో. కానీ ఇప్పుడు ఈ భవానీరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. తెలంగాణ జన సమితి నాయకురాలయ్యారు. సిడ్నీలో తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా (విఆర్ఎస్) చేసి ఇండియా వచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశించారు. సిద్ధిపేటలో పోటీ కూటమి తరుపున పోటీ చేస్తున్నారు. తెలంగాణ జన సమితి ఆమెకు టికెట్ కేటాయించింది.
మరి సిద్ధిపేట అనగానే ప్రత్యర్థులు భయపడే రోజులివి. ఎందుకంటే 1985 నుంచి సిద్ధిపేటలో కేసిఆర్ కుటుంబం తప్ప ఇంకొకరు గెలిచిన దాఖలాలు లేవు. 33 మూడేళ్లపాటు అయితే మామ కేసిఆర్ లేదంటే అల్లుడు హరీష్ రావే ఇక్కడ గెలుస్తూ వచ్చారు. సిద్ధిపేట ఇప్పుడు కేసిఆర్ కుటుంబానికి కంచుకోటగా మారింది. ఆ కంచుకోటను బద్ధలు కొడతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు భవాని రెడ్డి. ఎన్నికల ముందు నుంచే సిద్ధిపేటలో భవానిరెడ్డి విస్త్రృతంగా పర్యటించి జనాల్లో మమేకమయ్యారు. సిద్ధిపేట చుట్టూ ఉన్న 85 గ్రామాలను కలియదిరిగి ప్రచారం చేస్తున్నారు.
భవానిరెడ్డి ప్రైమరీ ఎడ్యూకేషన్ నాగిరెడ్డిపల్లె లో సాగింది. తర్వాత పదో తరగతి వరకు సిద్ధిపేటలో చదివారు. తర్వాత హైదరాబాద్ లో ఆటోమొబైల్ బ్రాంచ్ లో పాలిటెక్నిక్ పూర్తి చేశారు. తర్వాత ఆమెకు ఆర్టీసిలో ఉద్యోగం వచ్చింది. సిద్ధిపేట ఆర్టీసి డిపోలో ఉద్యోగం చేస్తూనే ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 2000 నుంచి 2004 వరకు ఆర్టీసి సిద్ధిపేట డిపొలో డిప్యూటీ సూపరింటెండెంట్ గా పనిచేశారు. తర్వాత ఇంజనీరింగ్ పూర్తి కావడంతో ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో పెద్ద ఉద్యోగం వచ్చింది భవానిరెడ్డికి. దీంతో సిడ్నీ ఫైట్ ఎక్కేశారు. 11 ఏళ్ల పాటు సిడ్నీలోనే ఉద్యోగం చేశారు.
కానీ ఆమె సిడ్నీలో ఉన్న కాలంలోనే తెలంగాణ మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. ఆ ప్రభావంతో సిడ్నీలో ఉండి తెలంగాణ ఉద్యమానికి చేయూతనిచ్చారు. తెలంగాణ ఏర్పాటును ఆకాంక్షిస్తూ అక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ జెఎసి ఏర్పాటైన నాటినుంచి జెఎసికి అనుబంధంగా పనిచేశారు భవానిరెడ్డి. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత 2015లో ఆమె స్వదేశానికి వచ్చారు. ఇక ఉద్యోగాలు చేయడం కాదు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆమె కుటుంబసభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అందుకే తను పుట్టి పెరిగిన సిద్ధిపేట నుంచే అసెంబ్లీకి పోటీకి దిగారు.
సిద్ధిపేట అనగానే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న రోజులివి. ఎందుకంటే సిద్ధిపేట కేసిఆర్ కుటుంబాన్ని ఢీకొట్టేవారే కరువయ్యారు. 1985 నుంచి కేసిఆర్, హరీష్ రావు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. పైగా తెలంగాణ ఉద్యమకాలంలో జరిగిన ఉప ఎన్నికల్లో లక్ష ఓట్ల తేడాతో ప్రత్యర్థుల డిపాజిట్లు కొల్లగొట్టి గెలిచారు హరీష్ రావు. ఇప్పటికీ సిద్ధిపేటలో హరీష్ రావు హవా అలాగే ఉందన్న ప్రచారం ఉంది. మరి ఈ పరిస్థితుల్లో సిద్ధిపేటలో రాజకీయాలు నడపడం అంత సులువైన విషయం కాదు. పైగా ఒక మహిళ సిద్ధిపేటలో హరీష్ ను ఢీకొట్టగలరా అన్న అనుమానాలున్నాయి. కానీ భవానిరెడ్డి మాత్రం తనకు ఏమాత్రం భయంలేదని చెబుతున్నారు. సిద్ధిపేట ఏమైనా కేసిఆర్ కుటుంబానికి రాసిచ్చారా? అంటున్నారామె.
భవానిరెడ్డి కుటుంబానికి రాజకీయ చరిత్ర పెద్దగా లేకపోయినా ఉద్యమ చరిత్ర బాగా ఉంది. ఆమె తండ్రి 1969 ఉద్యమంలో పాల్గొన్నారు. అలాగే తమ పూర్వీకులు భూదాన్ ఉద్యమ ప్రభావంతో సుమారు 300 ఎకరాలు దానం చేశారని భవానీరెడ్డి చెబుతున్నారు. తాను సైతం తెలంగాణ ఉద్యమంలో ఇప్పటి వరకు తనవంతు పాత్ర పోశిస్తున్నానని చెబుతున్నారు. 2015లో సిడ్నీ నుంచి ఇండియా తిరిగి వచ్చిన తర్వాత భవానిరెడ్డి కన్స్ స్ట్రక్షన్ కంపెనీ ప్రారంభించారు. ప్రస్తుతం పెద్ద సంఖ్యలో తన కంపెనీలో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. తాను మెకానికల్ డిప్లొమా, మెకానికల్ ఇంజనీరింగ్ చదివేరోజుల్లో అమ్మాయిలు ఆ కోర్సు చదివేందుకు పెద్దగా ముందుకు వచ్చే పరిస్థితి లేదని చెబుతారు భవానిరెడ్డి. కానీ తాను ధైర్యంగా మెకానికల్ ఇంజనీరింగ్ చదివానని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కన్స్ స్ట్రక్షన్ ఫీల్డులో కూడా ఆడవాళ్లు తక్కువగా ఉన్నారని అంటున్నారు. తాను ధైర్యంగా ఈ ఫీల్డులోకి వచ్చానని అంటున్నారు. ఇప్పుడు రాజకీయాల్లో ప్రవేశించానని చెబుతున్నారు.
సిద్ధిపేట నియోజకవర్గంలోని పరిసర ప్రాంతాల్లో తమ ఫ్యామిలీకి మంచి సంబంధాలున్నాయని, రానున్న ఎన్నికల్లో తనుక ఈ అంశం చాలాబాగా కలిసి వస్తుందని చెప్పారు. మహాకూటమి అభ్యర్థిగా తనకు జనాలు పాజిటివ్ గా రెస్పాన్స్ ఇస్తున్నట్లు చెప్పారు. ఏ ఆకాంక్షల కోసమైతే తెలంగాణ సాధించామో ఆ ఆకాంక్షలు నెరవేర్చడంలో టిఆర్ఎస్ పార్టీ ఘోరంగా విఫలమైందన్నారు భవానీ. కేవలం కుటుంబ ప్రయోజనాలే తప్ప తెలంగాణ ప్రయోజనాలు పట్టడంలేదన్నారు. ఉద్యమ కాలంలో ఉన్న టిఆర్ఎస్ కు ఇప్పటి టిఆర్ఎస్ కు పొంతన లేకుండాపోయిందని ఆరోపించారు. మరి భవానీరెడ్డి ఏమేరకు సిద్ధిపేట మీద పట్టు సాధిస్తారన్నది మరికొద్ది గడియల్లోనే తేలనుంది.