కాంగ్రెస్‌కు బిసి నేత గుడ్ బై?

కాంగ్రెస్ నేత, శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రకటించిన 65 మంది అభ్యర్దుల జాబితాలో తన పేరు లేకపోవడం మరియు శేరిలింగంపల్లి సీటు కూటమి పొత్తులో భాగంగా టిడిపికి కేటాయించడంతో ఆయన మంగళవారం ఉదయం కార్యకర్తలతో అత్యవసర సమావేశమయ్యారు. టిడిపికి చెందిన భవ్య ఆనంద ప్రసాద్ కు శేరిలింగంపల్లి సీటును కేటాయించారు. పార్టీ కోసం అహర్నిషలు శ్రమించి, పోరాడిన తనకు టికెట్ కేటాయించక పోవడం పై ఆయన అసంతృప్తితో ఉన్నారు. బిసి నేత అయినందుకే చిన్న చూపు చూసి అగ్రవర్ణాలకు టికెట్ కట్టబెడుతున్నారని యాదవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

భిక్షపతి యాదవ్ 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. 2009 లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీ అధికారంలో లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ క్యాడర్ ను కాపాడుకుంటూ వస్తున్నారని నేతలు చెబుతున్నారు. మహాకూటమి పొత్తులో భాగంగా శేరిలింగంపల్లి సీటును టిడిపికి కేటాయించారు. దీంతో తానిక కాంగ్రెస్ లో ఉండాల్సిన అవసరం లేదని భిక్షపతి యాదవ్ కార్యకర్తల వద్ద అన్నట్టు తెలుస్తోంది. ఖచ్చితంగా ఎన్నికల్లో పోటి చేయాలని కాంగ్రెస్ కు రెబల్ గా లేదా స్వతంత్ర అభ్యర్ధిగానైనా పోటి చేయాల్సిందేనని భిక్షపతి యాదవ్ నిర్ణయించుకున్నట్ట సమాచారం. ఇదే విషయాన్ని కార్యకర్తల వద్ద తెలపగా కార్యకర్తలు కూడా అందుకు ఒప్పుకున్నట్ట తెలుస్తోంది.

భిక్షపతి యాదవ్ కు టికెట్ కేటాయించాలని అతని అనుచరులు రెండు రోజుల పాటు గాంధీ భవన్ ముందు ఆందోళన నిర్వహించారు. ఓ అభిమాని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. మరో వ్యక్తి గాంధీ భవన్ పైకెక్కి కిందకు దూకేందుకు ప్రయత్నించాడు. దీంతో గాంధీ భవన్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. అప్పుడు మధుయాష్కి వచ్చి భిక్షపతి యాదవ్ తో చర్చించి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ఆయన ఆందోళన విరమించారు. అయినప్పటికి కూడా టికెట్ రాలేదు.

మరో యాదవ నేత బొల్లం మల్లయ్య యాదవ్ టిడిపి క్రియాశీలక నేత. కోదాడ నియోజకవర్గం నుంచి మల్లయ్య యాదవ్ టిడిపి సీటును ఆశించారు. కానీ అక్కడ ఆయన ఆశలపై నీళ్లు చల్లుతూ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ కు కేటాయించారు. బొల్లం మల్లయ్య యాదవ్ అంటే కోదాడ, కోదాడ అంటే బొల్లం మల్లయ్య యాదవ్ అనేలా ఆయన పేరు సంపాదించాడని టిడిపి నేతలు అన్నారు. అటువంటి నేతకు టికెట్ కేటాయించకపోవడం దారుణమన్నారు. మల్లయ్య యాదవ్ కు సూర్యాపేట, కోదాడ డివిజన్లలో గట్టి పట్టుంది. బలమైన క్యాడర్ బొల్లం మల్లయ్య యాదవ్ వెంట ఉందని, మల్లయ్య యాదవ్ స్వతంత్ర అభ్యర్దిగా పోటి చేయాలని ఆయన అనుచరులు అతని పై ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలుస్తోంది.

కీలకమైన ఇద్దరు యాదవ నేతలకు టికెట్లు ఇవ్వకుండా కాంగ్రెస్, టిడిపి వ్యవహరించడంతో యాదవ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం  చేశారు.  అగ్రవర్ణాలకు టికెట్లిచ్చి యాదవులు, బిసిలైనందున చిన్న చూపుతో వివక్ష చూపిస్తున్నారని యాదవ సంఘం నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. బిసిల ఎదుగుదలను ఓర్వలేక అగ్రవర్ణాలకు టికెట్లు కేటాయించారంటూ ఆయన మండిపడ్డారు. కూటమి పొత్తులో బలి చేసేందుకు యాదవులే దొరికారా అంటూ ఆయన ప్రశ్నించారు.

 కూటమి పొత్తులో బిసిలకు అన్యాయం జరిగిందని వెంటనే జాబితాను మార్చి బిసిలకు, యాదవులకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. మల్లయ్య యాదవ్ కు కోదాడ టికెట్, భిక్షపతి యాదవ్ కు శేరిలింగంపల్లి టికెట్ కేటాయించాలన్నారు. లేని పక్షంలో వారిద్దరు స్వతంత్ర అభ్యర్దులుగా పోటి చేసినా గెలిచే అవకాశాలున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భిక్షపతి యాదవ్ ఏం నిర్ణయం తీసుకోనున్నారో అని అంతటా చర్చ జరుగుతోంది.