వైరల్: తెలంగాణ రాజకీయాల్లో “వెటకార పంచాంగం”!

ఉగాది పర్వదినాన కూడా తెలంగాణలో పొలిటికల్ సెగలు రాజుకుంటూనే ఉన్నాయి. ట్విట్టర్ వేదికగా అధికార ప్రతిపక్ష పార్టీనేతల మధ్య పొలిటికల్ సెటైర్లు పేలుతూనే ఉన్నాయి. తెలంగాణ రాజకీయ నేతలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పుకోవడం ఒకెత్తు అయితే… శుభాకాంక్షల పేరుచెప్పి కాస్త డిఫరెంట్‌ గా వేసిన ఉగాది పంచాంగం సెటైర్స్ మాత్రం పీక్స్ అనే చెప్పాలి.

తెలంగాణ మంత్రి కేటీఆర్ .. బీజేపీ గురించి.. ఆదాయం, వ్యయం, అవమానం, రాజపూజ్యం ఇలా అన్ని విషయాలను ప్రస్తావించి మోడీ పేరెత్తకుండా వినూత్నంగా ట్వీట్ చేశారు. అనంతరం కేటీఆర్ ట్వీట్‌ కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా అంతే రీతిలో.. కల్వకుంట్ల కుటుంబం పేరేత్తి మరీ కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ వీరిద్దరూ చేసిన ట్వీట్స్ ని ఇప్పుడు చూద్దాం.

“ఆదాయం: అదానీకి! – వ్యయం: జనానికి, బ్యాంకులకు! – అవమానం: నెహ్రూకి! – రాజపూజ్యం: గుజరాతీ గుంపుకి!! – బస్, బభ్రాజీమానం భజగోవిందం! – దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం!” అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

దీనికి కౌంటర్ గా… “ఆదాయం: కల్వకుంట్ల కుటుంబానికి – వ్యయం: తెలంగాణ రాష్ట్రానికి – అవమానం: ఉద్యమ వీరులకు, అమరుల త్యాగాలకు – రాజపూజ్యం: ఉద్యమ ద్రోహులకు, దొంగలకు !! – తుస్.., పిట్టల దొర, తుపాకి చంద్రుల గడీల పంచాతీ లెక్క తేలుడే తరువాయి… పతనం ఇగ షురువాయే..” అని కేటీఆర్‌ కు అంతే రీతిలో బండి సంజయ్ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఈ ట్వీట్లు ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మోడీ ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని తెలిసినా.. బీఆరెస్ నేత‌లెవ‌రూ వెన‌క్కి తగడం లేదు. పైగా మోడీ, అమిత్‌షా ద్వయంతో తాడోపేడో తేల్చుకునేందుకే కేసీఆర్ నేతృత్వంలోని బీఆరెస్స్ నాయ‌కులు సిద్ధమవుతున్నారు. ఫలితంగా… ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో బీఆరెస్స్ – బీజేపీ మ‌ధ్య వార్ మ‌రింత హీటెక్కే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆరెస్స్ ఎమ్మెల్సీ క‌విత‌ను ఇప్పటికే మూడు సార్లు ఈడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. రాజ‌కీయ కక్షతోనే క‌విత‌ను ఇరికించాల‌ని.. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ప్రయత్నిస్తోందని .. తెలంగాణ మంత్రులు, అధికార పార్టీ నేత‌లు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉగాది పేరు చెప్పి కేటీఆర్ – బండి సంజయ్ లు టీట్ల యుద్దానికి తెరలేపారు. మరి ఈ ట్వీట్ల పంచాంగ యుద్ధం ఇక్కడితో అయిపోతుందా.. లేక, మరింత రాజుకుని రంజుగా మారుతుందా అన్నది వేచి చూడాలి!

Tweet War Between Bandi Sanjay And KTR | V6 News