తెలంగాణ: దుబ్బాక ఉప ఎన్నికల వేళ తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలేదన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా స్పందించారు. బీజేపీ నాయకులు చెప్పేది అబద్ధమని నిరూపిస్తే నిమిషంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతానని సీఎం కేసీఆర్ శనివారం (అక్టోబరు 31) మధ్యాహ్నం సవాలు విసిరారు. దీనిపై సాయంత్రం బండి సంజయ్ మాట్లాడుతూ ఒకవేళ కేంద్రం నిధులు విడుదల చేయలేదని నిరూపిస్తే దుబ్బాక చౌరస్తాలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటానని ఘాటుగా స్పందించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో బీజేపీ ప్రభుత్వాన్ని బెదిరించడం సరికాదని బండి సంజయ్ అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా శనివారం ఆయన రాయపోల్ మండలం పలు గ్రామాలలో రఘునందన్ రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణకు కేంద్రం నిధుల విడుదలపై చర్చకు రావాలంటూ సీఎం కేసీఆర్కు ప్రతి సవాల్ విసిరారు. ఒకవేళ నిధులు విడుదల చేయలేదని నిరూపిస్తే దుబ్బాక చౌరస్తాలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటానని కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు.
శనివారం మధ్యాహ్నం జనగామ జిల్లా కొడగండ్లలో రైతు వేదిక ప్రారంభం సందర్భంగా బీజేపీ నాయకులపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పెన్షన్ల విషయంలో బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం కేవలం మనిషికి రూ.200 చొప్పున మాత్రమే పింఛన్లు అందిస్తే.. బీజేపీ నేతలు మాత్రం రూ.1600 చొప్పున ఇస్తోందని అబద్దాలు ఆడుతున్నారని విమర్శించారు. పెన్షన్ల విషయంలో తాను చెప్పేది అబద్దమని నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని బీజేపీ నేతలకు కేసీఆర్ సవాల్ విసిరారు. పెన్షన్ల విషయంలో లెక్కలను కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ కూడా పబ్లిష్ చేసిందని కేసీఆర్ అన్నారు.