2019లో కెసిఆర్ మీద గద్దర్ పోటీ, ఎక్కడైనా సరే

2019 ఎన్నికల్లో  ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఎక్కడ పోటీ చేసినా, అసెంబ్లీ అయినా, లోక్ సభ అయినా, ఓడించేందుకు  ఒక వ్యూహం తయారవుతూ ఉంది.  ఆయన మీద అన్ని పార్టీల తరఫున ఒకే అభ్యర్థిని పోటీ పెట్టించేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయి.   ఆ ఒక్క అభ్యర్థి ఎవరో కాదు, ప్రజాగాయకుడు గద్దర్.  ఈ విషయాన్ని ఆదివారం నాడు  బడుగువర్గాల ప్రముఖ మేధావి ప్రొఫెసర్ కంచె ఐలయ్య చెప్పారు.

 

అదివారం నాడు‘తెలుగు రాజ్యం’ తో మాట్లాడుతూ  గద్దర్  బహుజన లెఫ్ట్ ఫ్రంటు అభ్యర్థి గా కెసియార్ మీద పోటీ చేస్తారని ఆయన చెప్పారు. అంతేకాదు,  తమ అభ్యర్థులను నిలబెట్టి, కెసియార్ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు  ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతామని ఆయన చెప్పారు. కెసియార్ మీద గద్దర తప్ప మరొక వ్యక్తిని నిలబెట్టకుండా ఉండేందుకు తానే స్వయంగా కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నానని ఫ్రొఫెసర్ ఐలయ్య వెల్లడించారు. ఇదే విధంగా ఇతర పార్టీలతో కూడా సంప్రదింపులు జరిపి కెసియార్ ను ఓడించేందుకు సహకరించాలని కోరతానని ఆయన చెప్పారు.

తెలంగాణ ఏర్పడిందని, అయితే, అది భూస్వామ్య తెలంగాణ అని చెబుతూ ప్రజాతెలంగాణ ఏర్పడేందుకు ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీ  లు ఐక్యం కావాలని చెబుతూ దీనికోసం ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆయన చెప్పారు.  ఈ విషయంలో తమకు మద్దతు నీయాలని తాను మావోయిస్టు పార్టీలను కూడా కోరుతున్నానని ఐలయ్య చెప్పారు.

తెలంగాణ ఫ్యూడల్ చేతుల్లోకి పోతున్నదని, దీనిని అడ్డుకోవడమే తమ కార్యక్రమమని ఆయన అన్నారు.

 బహుజన్ లెఫ్ట్ ఫ్రంటు తరఫు, 119 నియోజకవర్గాలలో కూడా అభ్యర్థులను నిలబెడతామని ఆయన చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ కూడ గద్దర్ ని తన వైపు తిప్పుకుని ఎన్నికల్లో నిలబెట్టించాలని చూస్తున్నదని ఆ మధ్య వార్తలొచ్చాయి.

గద్దర్ సిద్దమయితే , ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని, అర్వింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రతిపాదన చేసిందని చెబుతున్నారు.

ఇపుడు ప్రొఫెసర్ ఐలయ్య ఏకంగా గద్దర్ చేత కెసిఆయర్ ఓడించేందుకు కృషి జరగుతుందని చెబుతున్నారు.

2019 ఎన్నికల్లో ,మొత్తానికి, గద్దర్ కీలకమయిన అభ్యర్థి కాబోతున్నాడు.