జూబ్లీహిల్స్ లో ఒక్క చాన్స్ ఇవ్వండి సర్

తెలంగాణలో ఎన్నికల హడావిడి మరింతగా ఊపందుకున్నది. ఆశావహులు పార్టీ అధినేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ టికెట్ల వేటలో ఉన్నారు. టిఆర్ఎస్ లో ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ పార్టీలో ఇప్పటికే 105 మంది అభ్యర్థుల ప్రకటన అయిపోయింది. మహా అంటే మరో 14 స్థానాల్లో మాత్రమే ప్రకటించాల్సి ఉంది. అందులోనూ టిఆర్ఎస్ తన స్నేహ పార్టీ అయిన ఎంఐఎం సిట్టింగ్ లు ఉన్న స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ స్థానాల్లో బలహీనమైన అభ్యర్థుల వేటలో ఆ పార్టీ ఉన్నది.

మరోవైపు బిజెపితో చీకటి స్నేహం చేస్తుందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నది టిఆర్ఎస్. బిజెపి  సిట్టింగ్ స్థానాల్లో  (ఉప్పల్ మినహా) అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపుతారా? లేక బలహీనమైన వారిని దింపుతారా అన్నది తేలాల్సి ఉంది.

ఇక మహా కూటమిగా కాంగ్రెస్ పార్టీ, టిడిపి, సిపిఐ, తెలంగాణ జన సమితి జట్టు కట్టాయి. సీట్ల పంపకాలు ఇంకా తెగలేదు. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు? ఎవరికి బలమైన అభ్యర్థులు ఉన్నారు అన్న లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో టిడిపి లో సైతం యువ నేతలు, సీనియర్ నేతలు తాము ఆశిస్తున్న సీటు కోసం గట్టిగా పట్టు పట్టాలంటూ అధినేత చంద్రబాబుపై వత్తిడి పెంచుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లిహిల్స్ నియోజకవర్గ సీటును తనకు మహా కూటమిలో భాగంగా ఇప్పటించాలంటూ టిడిపి నాయకురాలు ఉప్పలపాటి అనూష రాం కోరుతున్నారు. 

చంద్రబాబును కలిసి తన బయోడేటాను ఇచ్చిన అనూష

ఆమె ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబును అమరావతిలో కలిశారు. తాను గత నాలుగేళ్లుగా జూబ్లిహిల్స్ లో చేపట్టిన కార్యక్రమాలను, అక్కడ తనకున్న పాజిటీవ్ అంశాలను చంద్రబాబుకు వివరించి తమకు జూబ్లీహిల్స్ సీటు కేటాయించాలని కోరారు. ఆమె అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని తెలుస్తోంది. అయితే కూటమి పొ్త్తులో భాగంగా జూబ్లిహిల్స్ సీటును టిడిపి గట్టిగా కోరుతున్న పరిస్థితి ఉంది.

ఈ సీటులో అనూష రాం తో పాటు ప్రదీప్ చౌదరి కూడా రేస్ లో ఉన్నారు. ఆయన కూడా గ్రౌండ్ లో సీరియస్ గా పనిచేసుకుంటున్నారు.  వీరిద్దరిలో మహిళా కోటా కింద అనూష రాం కు చాన్సెస్ ఉంటాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. అంతేకాకుండా ప్రదీప్ చౌదరి 2014 ఎన్నికల తర్వాత పార్టీ మారిన మైనస్ ఉంది. పార్టీ గ్రేటర్ అధ్యక్షులు మాగంటి గోపీనాథ్ తో పాటు బంగారు తెలంగాణ కోసం టిఆర్ఎస్ లో చేరారు ప్రదీప్. తర్వాత ఆయన కొద్ది రోజులకే అక్కడ ఇమడలేక తిరిగి టిడిపిలో చేరారు.  

2014 ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ టిడిపి అధ్యక్షుడుగా ఉన్న మాగంటి గోపీనాథ్ గెలిచారు. తర్వాత బంగారు తెలంగాణ సాధించే ఉద్దేశంతో ఆయన టిడిపికి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ లో చేరారు. ఈ నేపథ్యంలో ఈ సీటు టిడిపి దే కనుక ఈసారి కూడా కూటమిలో టిడిపి కే కేటాయించాలని కోరుతున్నారు. అయితే ఇక్కడ ఎవరికి ఇస్తారన్నది ఇంకా తేలలేదు. అనూష రాం, ప్రదీప్ చౌదరి ఇద్దరే కాకుండా మరికొందరు కూడా ఆశావహులు ఉన్నారు. 

అయితే జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో సెటిలర్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వారి ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్నందునే 2014లో మాగంటి గోపీనాథ్ ఇక్కడి నుంచి గెలిచారు. అయితే ఆయన టిఆర్ఎస్ లో చేరారు. కానీ టిడిపి కేడర్ మాత్రం ఇంకా ఆ పార్టీకి అంటిపెట్టుకునే ఉన్నారు. దీంతో గెలిచే అవకాశాలున్న జాబితాలో టిడిపికి జూబ్లిహిల్స్ కూడా ఉంది. కాబ్టటి ఇక్కడ పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పొత్తులపై క్లారిటీ వస్తే తప్ప ఇక్కడ క్యాండెట్ ఎవరనేది ఇప్పట్లో చెప్పలేమని అంటున్నారు. జూబ్లిహిల్స్ నుంచి గతంలో పిజెఆర్ తనయుడు విష్ణు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే గత 2014 ఎన్నికల్లో విష్ణు ఓటమిపాలయ్యారు. కూటమి సీట్ల సర్దుబాటుపై వేగంగా కసరత్తు జరుగుతున్నది. మరి అనూష కు టికెట్ వస్తుందా? లేదా అన్న ఉత్కంఠ మాత్రం ఆమె అభిమానుల్లో నెలకొంది. 

సోషల్ మీడియాలో అనూషకే మద్దతు

అనూష రాం కు సోషల్ మీడియాలో ఫుల్ సపోర్ట్ ఉంది. ఆమెను జూబ్లిహిల్స్ అభ్యర్థిగా ప్రకటించాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కోరుతున్నారు. టిడిపి అభిమాన గ్రూపుల్లోనూ ఆమెకు మద్దతు ఉంది. ఫేస్ బుక్ లో పల్స్ ఆఫ్ తెలంగాణ పేజీలో ఆమెకు, టిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ కు మధ్య ఓటింగ్ పెడితే భారీ తేడాతో అనూషకు ఆదరణ ఉంది. ఆ క్లిప్పింగ్ కింద ఉంది చూడండి.

 

ఇది కూడా చదవండి

‘‘ తెలంగాణ వాదులను తరిమికొట్టిన మైనంపల్లి , దానం నాగేంద‌ర్‌, తీగల కృష్ణారెడ్డిలను పార్టీలో చేర్చుకొని పెద్ద పీట వేసినప్పడు మీకు సిగ్గు అనిపించలేదా? ’’

కెసియార్ కు ఉత్తమ్ బహిరంగ లేఖ

 

 

బడి పోరగాళ్లను చేర్పుకున్న టిఆర్ఎస్ అభ్యర్థి వార్త కోసం క్లిక్ చేయండి.