ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేశారు మాజీ సీఎం చంద్రబాబు. ఆ తరువాత ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్.. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూనే.. కీలకమైన పరిపాలన రాజధానిగా విశాఖను మారుస్తామని ప్రకటించారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుందని ప్రకటించారు. అయితే ఈ మూడు రాజధానులు కాకుండా ఏపీకి మరో రాజధాని ఉంటుందని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ అన్నారు. తిరుపతి ఏపీకి రాజధాని అవుతుందని జోస్యం చెప్పారు. . తిరుపతి చూట్టూ లక్ష ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్న చింతా మోహన్.. తిరుపతి రాజధాని అవుతుందని బ్రహ్మంగారి కాల జ్ఞానంలో కూడా ఉందని వ్యాఖ్యానించారు.
తుళ్లూరు రాజధానిగా సాధ్యం కాదని చింతా మోహన్ అన్నారు. అది శపించబడిన స్థలమని తాను చంద్రబాబుకు ముందే చెప్పానని తెలిపారు. ఆ స్థలంలో చంద్రబాబు అడుగు పెట్టి మటాస్ అయ్యారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రులు అంజయ్య, భవనం వెంకట్రామ్, ఎన్టీఆర్ పదవులు సైతం పోయాయని చెప్పారు. తుళ్లూరులో అడుగుపెడితే పదవి గండం తప్పదని తెలిపారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక చరిత్రలో నిలబడిపోతుందని చింతా మోహన్ అన్నారు.
దేశ భవిష్యత్తుకు ఇది ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని అభిప్రాయపడ్డారు. అజ్ఞానంతో ప్రధాని మోదీ పరిపాలన చేస్తున్నారని ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నిక చంద్రబాబు, జగన్ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నిక కాదని, దేశ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నిక అని వ్యాఖ్యానించారు. బ్యాంకులు, రైల్వే, ఎల్ఐసీ, విశాఖపట్నం ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని చింతా మోహన్ తప్పబట్టారు. బీజేపీ, వైసీపీకి తేడా లేదని, ఎల్ఐసీ బిల్లు విషయంలో బలపరచడంతో తేటతెల్లమైందన్నారు.