తెలంగాణ భవన్ లోనూ హరీష్ రావుకు షాక్

టిఆర్ఎస్ లో బలమైన నేత, మంత్రి తన్నీరు హరీష్ రావుకు తెలంగాణ భవన్ లోనూ షాక్ తప్పలేదు. ప్రత్యర్థులపై ఆయన ఎంత పోరాటం చేసినా, ప్రతిపక్ష పార్టీలను ఆయన ఎంతగా తూలనాడినా డోంట్ కేర్ అన్నారు. పంచ్ డైలాగులతో విరుచుకుపడ్డా పట్టించుకోలేదు. మాటల సునామీని లెక్క చేయలేదు. మిగతా అందరూ ఆయనను గౌరవించినా అయిన వాళ్లు మాత్రం అసలే పట్టించుకోలేదు. తెలంగాణ భవన్ లో ఏం జరిగింది? చదవండి.

కొడంగల్ నియోజకవర్గానికి చెందిన టిడిపి, కాంగ్రెస్ నేతలు సుమారు 3 వేల మంది తెలంగాణ భవన్ కు వచ్చి హరీష్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి హరీష్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మరో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. కొడంగల్ లో ఎప్పటి నుంచో హరీష్ రావు ఎఫర్ట్ పెట్టి రేవంత్ రెడ్డిని బలహీనపరిచేందుకు కార్యాచరణ చేపట్టారు. పలుమార్లు కొడంగల్ వెళ్లి అక్కడ టిఆర్ఎస్ పార్టీ నేతల మధ్య సవన్వయం కోసం ప్రయత్నాలు చేశారు.

కొడంగల్ నుంచి విచ్చిన వివిధ పార్టీల కార్యకర్తలతో హరీష్ రావు

ఈ సమయంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత గుర్నాథ్ రెడ్డి, ఆయన తనయుడు ముద్దప్ప ఆధ్వర్యంలో ఈ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ తరలించి తెలంగాణ భవన్ లో జాయిన్ చేయించారు.  ప్రస్తుతం అక్కడ టిఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారు. అయితే అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి, గుర్నాథ్ రెడ్డి వర్గానికి మధ్య విబేధాలున్నట్లు అప్పట్లో గుసగుసలు వినిపించాయి. దీంతో హరీష్ రావు ఎఫర్ట్ పెట్టి వారిద్దరినీ ఏకం చేశారు. అంతేకాదు గుర్నాథ్ రెడ్డి ముందు నడిచి ఈ జాయినింగ్స్ చేయించారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో జరిగిన ఈ జాయినింగ్ సమావేశం గురించి అదే భవన్ లో పై ఫ్లోర్ లో ఉన్న టిన్యూస్ లో ఈసమంత వార్త రాలేదు. కనీసం స్ర్కోలింగ్స్ కూడా రాలేదు. వార్త లేదు, హరీష్ బొమ్మ లేదు. అయితే మిగతా ఛానెళ్లు అన్నీ దాదాపుగా హరీష్ మాట్లాడుతున్నంత సేపు లైవ్ కవరేజీ ఇచ్చాయి. ప్రధాన ఛానెళ్లన్నీ లైవ్ కవరేజీ ఇవ్వడంతోపాటు వార్తను పలుమార్లు ప్రసారం చేశాయి. కానీ సొంత ఛానెల్ గా ముద్రపడ్డ టిన్యూస్ లో వార్త రాలేదు.

గులాబీ కండువాలు కప్పి కొడంగల్ వారిని టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్న హరీష్ రావు

ఇక హరీష్ రావు నాయకత్వంలో చేరిన కారణంగా సొంత మీడియాలో ప్రచారం, ప్రసారం కోల్పోయామన్న భావనలో గుర్నాథ్ రెడ్డి, ముద్దప్ప ఉన్నట్లు ఆయన అనుచరుల్లో ప్రచారం జరుగుతున్నది. మిగతా ముఖ్యమైన దినపత్రికలు అన్నింటిలోనూ హరీష్ రావు వార్త మెయిన్ పేజీల్లో ప్రచురించారు. ప్రాధాన్యత కల్పించారు. కానీ టిఆర్ఎస్ అనుకూల నమస్తే తెలంగాణలో మాత్రం వికారాబాద్ జిల్లా టాబ్లాయిడ్ లో గింతంత ఫొటో వేసి చిన్న ఐటమ్ వేశారు. నమస్తే తెలంగాణ మెయిన్ లో చిన్న చిన్న జాయినింగ్స్ కు కూడా చోటు కల్పించి వేలాది మందితో తెలంగాణ భవన్ లో జాయినింగ్ అయినప్పటికీ ఈ వార్తను ప్రచురించలేదు.

సిద్ధిపేట, మెదక్ జిల్లాల్లో అంటే హరీష్ రావు వార్త రాకపోవచ్చు కనీసం తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమం కూడా ఎందుకు రాలేదబ్బా అన్న చర్చ మళ్లీ మొదలైంది. ఈ అప్రకటిత నిషేధం ఎప్పటి వరకు కొనసాగుతుందో తెలియక హరీష్ రావు అభిమానులు, ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు.