కవితను ఆరాతీసిన కేసీఆర్… కూతురుకిచ్చిన సలహాలివే!

రెండ్రోజుల పాటు జరిగిన ఈడీ విచారణ ముగియడంతో బీఆరెస్స్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ చేరుకున్నారు. కవితతో పాటు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ లు కూడా హైదరాబాద్ కు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న కవిత ప్రగతి భవన్ కు వెళ్లారు. దీంతో… ప్రగతిభవన్ కు రాగానే కవితను పిలిచిన కేసీఆర్… ఏకాంతంగా తీవ్రంగా చర్చించినట్లు తెలుస్తుంది.

అవును… ప్రగతిభవన్ లో గంటల తరబడి ఈడీ విచారణపై తండ్రీ – కూతురు మధ్య చర్చలు కొనసాగుతున్నాయట. ఈ నెల 20, 21 తేదీలలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అడిగిన ప్రశ్నలు, అందుకు ఆమె ఇచ్చిన సమాధానాలను కవిత సవివరంగా వివరించారంట. కవిత హస్తినలో ఈడీ విచారణను ఎదుర్కొంటున్న సమయంలో తీవ్ర ఆందోళనకు గురైన కేసీఆర్.. ఆ మూడు రోజులూ పనులన్నీ పక్కనపెట్టి ముభావంగా గడిపారన్న సంగతి తెలిసిందే!

దీంతో ఈరోజు కూతురు విచారణ పూర్తి చేసుకుని రాగానే కాస్త రిలాక్స్ అయిన కేసీఆర్… “ఎన్ని ప్రశ్నలు అడిగారు..? ఎన్నింటికి సమాధానం చెప్పావు..? సమాధానం చెప్పిన తర్వాత వాళ్లు ఎన్ని గంటలు వెయిటింగ్ చేయించారు..? ఇంకా ఏమైనా వివరాలు అడిగారా..?” అంటూ కవిత నుంచి సమాచారాన్ని తెలుసుకుంటున్నారట. ఈ సందర్భంగా కేసీఆర్ అడిగిన ప్రశ్నలతోపాటు.. తన పట్ల ఈడీ అధికారులు వ్యవహరించిన తీరును సైతం కవిత వివరించినట్లు తెలుస్తుంది!

ఇదే క్రమంలో ఈనెల 24వ తేదీన సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ విచారణకు వస్తుండటంతో… ఆ తీర్పు ఎలా వస్తే, తదుపరి ఎలాంటి స్టెప్ తీసుకోవాలనేదానిపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. అనంతరం… గత రెండు రోజులు ఢిల్లీలో న్యాయ బృందంతో చర్చించిన అంశాలను, విచారణకు ముందు తీసుకున్న సలహాలను, సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ వ్యవహారాన్ని.. కేటీఆర్ వివరించినట్లు తెలుస్తుంది.

ఇదే క్రమంలో… ఈడీ అధికారులు మరోసారి విచారణకు పిలుస్తారనే చర్చ నడుస్తున్న తరుణంలో… ఆ విషయాలపై కూడా ప్రశ్నించిన కేసీఆర్… అధికారుల రియాక్షన్ గురించి ఆసక్తిగా ప్రశ్నిస్తున్నారట. ఇక మొబైల్ ఫోన్లు అధికారులకు అందజేసినప్పుడు ఈడీ అధికారుల రియాక్షన్ ఎలా ఉందనే దానిపై కూడా కేసిఆర్‌ కు కవిత వివరించినట్లు విశ్వసనీయ సమాచారం.

అయితే హస్తిన విషయాలపై ఆరాతీసిన అనంతరం… మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని, ఆచితూచి వ్యవహరించాలని, లోపల జరిగిన విషయాలు సైతం మీడియాకు వెల్లడించవద్దని కేసీఆర్ సూచించారట. ఈ విధంగా తండ్రీ – కూతురి మధ్య వివరాలు – సలహాలు అనే కార్యక్రమం జరిగిందన్న మాట!