జీహెచ్ఎంసీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ఉదయమే ప్రారంభం అయింది. కౌంటింగ్ నడుస్తోంది. ప్రస్తుతానికి బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. సుమారు 85 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా… టీఆర్ఎస్ పార్టీ 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎంఐఎం పార్టీ 17 స్థానాల్లో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది.
ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభమయినా… బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరగడంతో లెక్కింపు ప్రక్రియలో ఆలస్యం అవుతోంది. దీంతో ఫలితాలపై స్పష్టత రావాలంటే మధ్యాహ్నం 3 గంటల దాకా ఆగాల్సిందే.
ముందుగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కించారు. ఆ తర్వాత బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. 1926 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ప్రకారం బీజేపీ దూకుడు మీదుంది.
బ్యాలెట్ బాక్సుల్లో ఉన్న ఓట్లను రెండు దశల్లో లెక్కిస్తున్నారు. ముందుగా బాక్సుల్లో ఉన్న ఓట్లను లెక్కించిన తర్వాత.. అభ్యర్థుల ప్రకారం లెక్కిస్తున్నారు. ఒక రౌండ్ లో సుమారు 14 వేల ఓట్లను అధికారులు లెక్కించనున్నారు. 150 డివిజన్ల ఓట్ల లెక్కింపు కోసం 30 కేంద్రాలను ఏర్పాటు చేశారు.