చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తం తిరిగేసి మానవ జాతిని అతలాకుతలం చేసింది. ప్రస్తుతం తగ్గుముఖం పట్టిందని అనుకుంటున్నా తరుణంలో పిడుగులాంటి వార్త ఒకటి వెలుగు చూసింది. ఏంటంటే… బ్రిటన్‌లో ఓ కొత్త రకం కరోనా వైరస్ ని గుర్తించారు. ఈ కొత్త వైరస్ కరోనా వైరస్ కంటే వేగంగా వ్యాపిస్తోందట .దీనివల్ల బ్రిటన్‌లో పరిస్థితి చేయి దాటి పోవడంతో లండన్‌తోపాటు ఆగ్నేయ ఇంగ్లండ్‌లో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. కరోనా వ్యాక్సిన్ దేశమంతా సప్లై అయ్యే వరకూ కొన్ని నెలలపాటూ నిబంధనలు కొనసాగుతాయని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదేశించారు . అప్రమత్తమైన పలు దేశాలు యూకే నుంచి విమానాల రాకపోకలను నిషేధించాయి.
బ్రిటన్ నుంచే వచ్చే విమానాలపై నిషేధం విధించాలని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. బ్రిటన్‌లో వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ కొత్త మ్యుటేషన్ సూపర్ స్ప్రెడర్‌లా ఉందని సోమవారం ఆయన ట్వీట్ చేశారు.ఈ కొత్త కరోనా వైరస్ వార్తతో మహారాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ముంబైతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో నైట్ కర్ఫ్యూ విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని ప్రకటించింది. ఈ నెల 22 నుంచి జనవరి 5వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని వెల్లడించింది. అదేవిధంగా యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు 14రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని స్పష్టం చేసింది.
మహారాష్ట్ర ప్రభుత్వం మాదిరిగానే తెలంగాణ వైద్యశాఖ కూడా అప్రమత్తమైంది. గత వారం రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన వారిని ట్రాక్ చేయనున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ఆర్టీపీసీఆర్ టెస్టుల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. పాజిటివ్ వచ్చిన వారిని ఆసుపత్రికి తరలించనున్నారు. నెగిటివ్ వచ్చినవారికి వారం రోజులు క్వారంటైన్‌కు తరలించేవిధంగా చర్యలు చేపట్టారు. కొత్తరకం కరోనా వైరస్ వార్తతో మిగతా రాష్ట్రాలు కూడా అలర్ట్ అవుతున్నాయి. త్వరలో మరో ఉపద్రవం ముంచుకు రావొచ్చని వైద్య నిపుణులు హెచచరిస్తున్నారు.