సాధారణంగా వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో భార్యాభర్తల మధ్య చిన్నగా మొదలైన గొడవలు పెద్దగా మారి ఇద్దరిని దూరం చేస్తాయి. అంతేకాకుండా చాలామంది మహిళలు అత్తింటి వారి వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్ళిపోవడం లేదా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటీవల కూడా ఇటువంటి దారుణ సంఘటన చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులతో పాటు తల్లి కూడా కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇచ్చోడ మండలంలో చోటు చేసుకుంది.
వివరాలలోకి వెళితే…ఇచ్చోడ మండల కేంద్రంలోని రెడ్డి కాలనీకి చెందిన బాబురెడ్డి అనే వ్యక్తికి బజార్‌హత్నూర్ మండలం పిప్రి గ్రామానికి చెందిన వేదశ్రీ (26) తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ప్రజ్ఞ (5), వెన్నెల (3) ఉన్నారు. సంతోషంగా సాగిపోతున్న వీరి సంసారంలో కొంతకాలంగా గొడవలు మొదలయ్యాయి. ఇలా కుటుంబంలో తరచూ గొడవలు జరగటంతో వేదశ్రీ మనస్థాపం చెంది గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి వంట గదిలో తన ఇద్దరు కూతుర్లపై కిరోసిన్ పోసి ఆ తర్వాత తాను కూడా కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకుంది.
అయితే ఇంట్లో నుండి పొగలు రావడం గమనించిన స్థానికులు ఇంటి లోపలికి వెళ్లి చూడగా మంటలలో ఖాళీ వేదశ్రీ అక్కడే మరణించగా ఇద్దరు చిన్నారులు కొనఊపిరితో తీవ్ర గాయాలతో ఉండటంతో స్థానికులు హుటాహుటిన దగ్గరిలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తరలించిన కొంత సమయానికి ఆ ఇద్దరు చిన్నారులు కూడా మరణించారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని బాధితురాలి బంధువులను విచారించగా పెళ్లయిన సమయం నుండి అత్తింటి వారి తరఫునుండి వేదశ్రీకి వేధింపులు ఎక్కువగా ఉండటం వల్లే ఆమె ఇలా ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు వెల్లడించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.