Itlu Mee Cinema Movie Review: ‘ఇట్లు… మీ సినిమా’ మూవీ రివ్యూ & రేటింగ్ ..

అభి రామ్, వెన్నెల, మనోహర్, పవన్, కృష్ణ, మంజుల హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఇట్లు… మీ సినిమా’. హరీష్ చావా దర్శకత్వంలో లిటిల్ బేబీస్ క్రియేషన్స్ పతాకంపై నిర్మాత నోరి నాగ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నటుడు ప్రదీప్, అమ్మ రమేష్ ప్రధాన పాత్రలు పోషించారు. నలుగురు యువకులు తమకున్న ప్యాషన్ తో… సినిమా రంగానికి వచ్చి వాళ్లు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి… వాళ్ళు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారా లేదా అనే కథాంశంతో లవ్, రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రం… ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం పదండి.

కథ: రామ్(అభి రామ్) ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. తనకు సినిమాల్లో నటించడం అంటే చాలా ఇష్టం. అందుకే సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలేసి హైదరాబాద్ ఫిలిం నగర్ లో సినిమా అవకాశాలకోసం కాళ్లు అరిగేలా తిరుగుతూ ఉంటారు. అతనితో పాటు మరో ముగ్గురు(పవన్, మనోహర్, కృష్ణ)లు కూడా తమకు ప్యాషన్ తో సినిమాల్లో రాణించాలని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ట్రయల్స్ వేస్తూ ఉంటారు. ఈ నలుగురు కలిసి సినిమా ప్రయత్నాలు సాగిస్తారు. అయితే రామ్ కి జాను(వెన్నెల) అనే లవర్ ఉంటుంది. ఎలాగైనా రామ్ ను పెళ్లి చేసుకొని తీరాలని రామ్ వెంబడి పడుతూ ఉంటుంది. మరి ఈ క్రమంలో రామ్, జానుల ప్రేమ ఫలించిందా? రామ్ అతని స్నేహితులు ముగ్గురూ సినిమా రంగంలో రాణించారా? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ… కథనం విశ్లేషణ: సినిమా ఇండస్ట్రీ కష్టాల గురించి ఇదివరకే చాలా సినిమాలు వచ్చాయి. సినిమా మీద ప్యాషన్ తో యువకులు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు, ఇక్కడ వుండే సాదక బాధకాలను చాలానే చూపించేశారు. అయినా కూడా సినిమా రంగంలో స్థిరపడాలనే యువకులు కోకొల్లలు. మంచి జాబ్ ను, బిజినెస్ ను వదిలేసి… సినిమా రంగంలో రాణించాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొంత మంది సక్సెస్ అవ్వొచ్చు… కొంత మంది సక్సెస్ కాకపోవచ్చు. కానీ ప్రయత్నం అనేది సాగిస్తేనే… దానికి సార్థకత ఉంటుంది. చాలా నిజయతీగా పట్టుదలతో ప్రయత్నిస్తే… రాణించలేని రంగం అంటూ ఏదీ ఉండదనేది ఇందులో ఓ మెసేజ్ రూపంలో చూపించారు దర్శకుడు. చాలా మంది సినిమా ఇండస్ట్రీలో కష్టాలు ఎక్కువ… సక్సెస్ కాలేమనే వారికి ఇందులో నలుగురు యువకులు ఎంతో పట్టుదలో చేసే ప్రయత్నమే వారికి స్ఫూర్తిగా నిలుస్తుంది. అలాంటి పాయింట్ తో దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ అంతా సినిమా ప్రయత్నాల కోసం యువకులు పడే పాట్లను చూపించి… సెకెండాఫ్ లో కేవల ప్రయత్నాలే కాదు… తామే ఓ సినిమాని ఎందుకు తీయకూడదు… అందకు కావాల్సిన వనరుల్ని క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఎందుకు సమకూర్చకోకూడదని ఆలోచించి… చివరకు ఓ మంచి మూవీని తీసి విజయం సాధిస్తారు. ఇలాంటి స్పూర్తి దాయకమైన ప్లాట్ ను దర్శకుడు చాలా మెసేజ్ ఓరియంటెడ్ గా… లవ్, రొమాన్స్ తదితర వాటిని మేళవించి తెరకెక్కించారు. సినిమా రంగంలో సెటిల్ అవ్వాలనే యువకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.

సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. అందులో స్థిరపడి విహరించాలని ఓ నలుగురు యువకులు అనుకుంటారు. అలాంటి యువకుల పాత్రలు పోషించిన నలుగురూ బాగా నటించి ఎంటర్టైన్ చేశారు. అభిరామ్, వెన్నెల లీడ్ పెయిర్ గా కనిపించినా… మిగత ముగ్గురు యువకుల పాత్రలు కూడా సమానంగానే ఉన్నాయి. టీ స్టాల్ రాణిగా నటించిన మంజుల పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. కాస్టింగ్ కౌచ్ కు పాల్పడే నిర్మాత పాత్రలో నటించిన నటుడు బాగానే నటించారు. హీరోయిన్ తండ్రిగా నటించిన అతని పాత్ర పర్వాలేదు. నటుడు ప్రదీప్… మొదట్లో, చివర్లో కాసేపు కనిపించి ఆకట్టుకుంటారు. ఇక మిగతా పాత్రలన్నీ తమ తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.

దర్శకుడు సినిమా ఇండస్ట్రీలో కష్టాలపై రాసుకున్న కథ… స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్ గా ఉంది. ఎక్కడా బోర్ లేకుండా సినిమాని తెరకెక్కించారు. టీ స్టాల్ రాణిలాంటి సినిమాల్లో స్థిరపడే అమ్మాయిలను … సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నిర్మాతలు వేశాలు ఇస్తాం… మాకేంటి అని చెప్పి… చివరకు ఎలా మోసగిస్తారో… కాస్టింగ్ కౌచ్ రూపంలో చూపించారు. అలాగే కొత్తగా వచ్చే యువకులను నిర్మాతలు డబ్బులు కొంత మీరూ పెట్టండి…. మిగతాది నేను చూసుకుంటా అని చెప్పడం… ఇలాంటి సీన్స్ అన్నీతెరమీద చాలా సహజంగా అనిపిస్తాయి. పాటలు పర్వాలేదు. సంభాషణలు చాలా సరదాగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. గో అండ్ వాచ్ ఇట్..!!!

రేటింగ్: 3/5