తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీకి షాక్ మీద షాక్ తగలబోతున్నాయా? లేదు లేదంటూనే చేవెళ్ల ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన వేళ మరింత మంది ఆయన బాటలో నడవబోతున్నారా? మరో నలుగురు టిఆర్ఎస్ ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రెడ్డి పోలరైజేషన్ జరగబోతున్నదా? అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం వస్తోంది.
సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న పోస్టులు, ఎంపి విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా తర్వాత చర్చనీయాంశమైన అంశాలు తెలంగాణలో రాజకీయ వేడిని రగిలించాయి. విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామాకు ముందు ఇద్దరు ఎంపీలు టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి బాంబు పేల్చారు. అయితే ఆయన కొడంగల్ కు ఇటో అటో ఉన్న ఎంపీలు అంటూ కొద్దిగా క్లూ ఇచ్చారు. కానీ ఎవరి పేర్లనూ ఆయన బయట పెట్టలేదు. కానీ దుమారం మాత్రం రేగుతున్నది.
సీన్ కట్ చేస్తే కొండా విశ్వేశ్వర్ రెడ్డితోపాటు మహబూబాబాద్ ఎంపి ప్రొఫెసర్ సీతారాం నాయక్ పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిద్దరూ తాము టిఆర్ఎస్ లోనే ఉంటామని ప్రగతి భవన్ మెట్లెక్కి మరీ వివరణ ఇచ్చారు. తమ మీద జరుగుతున్న ప్రచారం అంతా ఉత్తుత్తి దే అని కేటిఆర్ కు వివరణ ఇచ్చారు. రేవంత్ వ్యాఖ్యలను తీవ్రాతా తీవ్రంగా ఖండించారు. అంతేకాదు ప్రొఫెసర్ సీతారాంనాయక్ రేవంత్ ను తీవ్రంగా తిట్టి పడేశారు. అయితే రేవంత్ చెప్పిన మాటలో ఒకటి నిజమైంది. కొండా గుడ్ బై చెప్పేశారు. మరి సీతారాం నాయక్ కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు పార్టీలో టాక్ నడుస్తున్నది.
ఈ పరిస్థితుల్లో మరిన్ని పేర్లు వెలుగులోకి వచ్చాయి. వారి పేర్లు తాలూకు జాబితా సోషల్ మీడియాలో హోరెత్తుతున్నది. టిఆర్ఎస్ ను వీడనున్న వారిలో ఆంధ్రా తెలంగాణ సరిహద్దులో ఉన్న నియోజకవర్గ ఎంపి పార్టని వీడి కాంగ్రెస్ లో చేరొచ్చని సమాచారం అందుతున్నది. ఆయన ఎమ్మెల్యే ఎన్నికల సీట్ల కేటాయింపులో పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు చర్చ ఉంది.
తెలంగాణ వచ్చినప్పటి నుంచి టిఆర్ఎస్ పార్టీలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఉన్నంత వెసులుబాటు ఎంపీలకు లేదన్న విమర్శ అయితే ఉన్నది. అందుకే ఎక్కువ మంది ఎంపీలు అసంతృప్తితో ఉన్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కొందరు ఎంపీలు అంటీముట్టనట్లుగా ఉన్నట్లు చెబుతున్నారు.
ఇక రాయలసీమ సరిహద్దులో ఉన్న ఎంపి ఒకరు కూడా టిఆర్ఎస్ అధినాయకత్వంపై ఆగ్రహంగా ఉన్నట్లు చర్చ జరుగుతున్నది. ఆయన తన నియోజకవర్గంలో ఇప్పటి వరకు ప్రచారంలో సీరియస్ గా పాల్గొనలేదని చెబుతున్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఆయన ప్రతి కార్యక్రమంలో హల్ చల్ చేసేవారు కానీ ఇప్పుడు కొంత అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.
ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన ఒక ఎంపీ కూడా అసంతృప్తితో ఉన్నట్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఆయన కూడా తన నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ సీట్ల కేటాయింపు ఏకపక్షంగా సాగిందన్న ఆవేదనతో ఉన్నట్లు చెబుతున్నారు. రెడ్డి సామాజికవర్గం కాకపోయినా ఆయన కూడా పార్టీని వీడనున్నట్లు గుసగుసలు మొదలయ్యాయి.
మొత్తానికి ఈనెల 23వ సోనియాగాంధీ సభలో సంచలనం రేగుతుందా? లేదా అన్నది ఉత్కంఠ మొదలైంది. 23న మేడ్చల్ సభలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఒక్కరే కాంగ్రెస్ లో చేరతారా? లేదంటే ప్రచారం జరుగుతున్న వారందరూ జాయిన్ అయితారా అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. సోనియా సభ బాధ్యతలను కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డికి అప్పగించారని వార్తలొస్తున్నాయి. అదే సమయంలో ఇద్దరు ఎంపీలు రాబోతున్నారంటూ రేవంత్ మాట్లాడిన పరిణామాలు చూస్తే కాంగ్రెస్ పార్టీ వైపు రెడ్డి నాయకులంతా పోలరైజ్ అవుతున్నట్లు చర్చలు మొదలయ్యాయి.
మరి ఇదే జరిగే పరిస్థితి ఉంటే తాజా రాజకీయాల్లో ఉద్దండ వ్యూహకర్తగా పేరున్న కేసిఆర్ ఏరకమైన విరుగుడు మంత్రం వేస్తారన్నది కూడా ఆసక్తికరమే.