ఈ తెలంగాణ గ్రామంలో 18 ఓట్లు వస్తే సర్పంచ్ అయినట్లే
అవును మీరు చదివిన హెడ్డింగ్ వందకు వంద శాతం నిజమే. ఆ ఊరిలో అక్షరాలా పద్దెనిమిది ఓట్లు సాధిస్తే సర్పంచ్ అయిపోయినట్లే లెక్క. మరీ అంత తక్కువగా ఓట్లు అంటే ఒక వార్డు సభ్యుడు కూడా గెలవలేడు. ఏకంగా 18 ఓట్లు వస్తే సర్పంచ్ గా గెలవడమేందబ్బా అనుకుంటున్నారా? ఇంతకూ ఆ ఊరు ఎక్కడుంది అనుకుంటున్నారా? పూర్తి వివరాలు చదవండి.
అదొక చిన్న అందమైన పల్లెటూరు. ఎంత చిన్నదంటే మేజర్, మీడియం గ్రామ పంచాయతీల్లో వార్డు కంటే చిన్నది. తెలంగాణలో అతి తక్కువ ఓటర్లు కలిగిన గ్రామ పంచాయతీ ఏదో తెలుసా? ఆ ఊరి పేరు దొంగతోపు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆళ్లపల్లి మండలంలోని గ్రామమే ఈ దొంగతోపు. ఈ గ్రామంలో 18 ఓట్లు సాధించినవారు సర్పంచ్ గా ఎన్నికవుతారు. 10 ఓట్లు సాధించిన వారు గట్టి పోటీ ఇచ్చిన ప్రత్యర్థులుగా నిలబడినట్లు లెక్క. ఇంత తక్కువ మొత్తాలతో గెలుపోటములు ఉన్నాయంటే ఆ ఊరిలో ఉన్న ఓటర్లు ఎందరున్నారనేగా మీ డౌట్.
దొంగతోపు గ్రామ జనాభా 106 మంది. ఈ గ్రామ ఓటర్లు 34 మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ ఓటర్లున్న గ్రామపంచాయతీగా దొంగతోపు రికార్డు దక్కించుకున్నది. ఈ చిన్న గ్రామంలో ఉన్న వార్డులెన్నో తెలుసా? జస్ట్ 4 మాత్రమే. అంటే ఒక్కో వార్డు సభ్యుడు గెలవాలంటే ఐదు ఓట్లు వస్తే వార్డు సభ్యుడిగా గెలిచిపోయినట్లే లెక్క.
ఒకవేళ ఈ గ్రామంలో ట్రయాంగిల్ ఫైట్ ఉంటే విజేత కావడానికి అవసరమైన ఓట్లు 18 కూడా ఉండదు. మరింత తగ్గే పరిస్థితి ఉంటుంది. త్రికోణ పోటీ ఉంటే పది ఓట్లు వచ్చినా సరే ఇక్కడ సర్పంచ్ అయిపోవచ్చని చెబుతున్నారు.
ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆళ్లపల్లి మండంలోనే మరో చిన్నగ్రామం కూడా ఉంది. ఆ గ్రామం పేరు అడవి రామం. ఈ ఊరి జనాభా 170 మంది ఉండగా ఓటర్లు మాత్రం 64మందే ఉన్నారు. ఈ గ్రామంలో సర్పంచ్ పదవి దక్కాలంటే 33 ఓట్లు వస్తే సరిపోతుంది. అంటే ఇద్దరు పోటీలో ఉంటేనే 33 రావాలి. ఒకవేళ ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉంటే ఆ సంఖ్య మరింతగా పడిపోతుంది.
దొంగతోపు గ్రామం గురించి జిల్లాలోనే కాకుండా రాష్ట్రమంతా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.