ఆయనను ప్రజలంతా కలియుగ దైవం గా కొలుస్తారు. ఆయన ఆపదమొక్కులవాడు. ఆయన దర్శనం చేసుకుంటే కష్టాలు గట్టెక్కుతాయి. కానీ ఈ వృద్ధ జంటకు ఆయన కలియుగ దైవం కాదు. ఈ జంటకు లేని ఆపద తెచ్చి పెట్టిండు. ఈయనను దర్శించుకున్నందుకే ఈ జంటకు కష్టాలొచ్చాయి. వీరిలో ఒకరు తనువు చాలించారు. ఇంకొకరు అష్టకష్టాలు పడుతున్నారు. కోరిన కోర్కెలు తీర్చే తిరపతి వెంకన్నా… మరి ఈ జంట చేసిన పాపమేమిటి? వీరికి ఎందుకీ శిక్ష. అని గ్రామస్తులంతా కంటతడి పెట్టిన సందర్భం. మనసులు కలచివేస్తున్న ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. పూర్తి వివరాలు చదవండి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల గ్రామంలో గణేష్ నగర్ కు చెందిన బొబ్బిలి రాములు, వెంకటలక్ష్మి భార్యాభర్తలు. వీరు గుంటూరు జిల్లాకు చెందిన వారు. పదేళ్ల క్రితం చర్ల గ్రామంలోని గణేష్ నగర్ కు వచ్చి నివాసం ఉంటున్నారు. ఆ సమయంలో పేదలంతా గుడిసెలు వేసుకుంటున్న వేళ వీరు కూడా ఒక గుడిసె వేసుకుని అక్కడే జీవిస్తున్నారు. ఇస్త్రీ పెట్టె వీరి జీవనాధారం. గ్రామంలో జనాల బట్టలు ఇస్త్రీ చేసి వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తున్నారు. వీరికి తిరుపతి వెంకన్నను దర్శించుకోవాలన్న కోరిక ఉండేది. ఆ కోరిక నెరవేర్చుకునేందుకు పైసా పైసా కూడబెట్టుకుని 2015 జనవరిలో తిరుపతి వెళ్లారు.
తిరుపతిలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత బొబ్బిలి రాములు తన భార్య వెంకటలక్ష్మికి కొంత డబ్బు ఇచ్చి లడ్డూలు తీసుకురావాలని పంపించాడు. అలా వెళ్లిన వెంకటలక్ష్మి తప్పిపోయింది. సాయంత్రం వరకు రాములు తిరుమల కొండ అంతా గాలించినా వెంకట లక్ష్మి ఆచూకి దొరకలేదు. మైక్ లో అనౌన్స్ మెంట్ చేయించినా లాభం లేకుండాపోయింది. పాపం ఆమె చేతిలో లడ్డూలకు ఇచ్చిన డబ్బు తప్ప చిల్లిగవ్వ లేదు. దీంతో తనకు తన ఊరికి ఎలా వెళ్లాలో తెలియలేదు.
విధిలేని పరిస్థితుల్లో తిరుమలలోనే వెంకటలక్ష్మి బిచ్చమెత్తుకుని కాలమెల్లదీసింది. అలా మూడేళ్లు గడిచిపోయాయి. తీరా ఊరికి వచ్చేంత మందం డబ్బు జమ చేసుకుని సోమవారం తన స్వగ్రామానికి చేరుకున్నది. తన ఇంటికొచ్చిన ఆమెకు తెలిసిన వార్త గుండెలు పిండేసింది. ఆ వార్త విన్న వెంకటలక్ష్మి కుప్పకూలిపోయింది. అయ్యో ఎంత పనైంది తిరుపతి వెంకన్నా అని కన్నీరు మున్నీరైంది.
అయితే 2015లోనే రాములు భార్య ఆచూకీ దొరకకపోవడంతో ఇంటికి తిరిగొచ్చేశాడు. అయితే ఇంతకాలం తనతో సంసారం చేసిన భార్య తప్పిపోవడం ఆయనను కలచివేసింది. భార్య వస్తుందేమో అని నాలుగు నెలలపాటు ఎదురుచూసి మనోవేదనతో మంచం పట్టాడు. తుదకు 2015 ఏప్రిల్ మాసంలో పుట్టెడు బాధతోనే రాములు కన్నుమూశాడు. అయితే ఆయన మరణ వార్త వెంకటలక్ష్మికి స్వగ్రామానికి వచ్చిన తర్వాతే తెలిసింది. ఎన్నో కష్టాలు పడి ఇంటికొచ్చేసరికే భర్త చనిపోయి ఉండడంతో ఆమె రోధిస్తోంది. నాలుగేండ్ల కిందట వారిని విధి వేరు చేసింది.
నేనెట్ల బతకాలి ?
స్వగ్రామానికి వచ్చిన వెంకటలక్ష్మి ఉండేందుకు ఇల్లు లేదు. రేషన్ కార్డు లేదు. వృద్ధాప్య పెన్షన్ లేదు. కష్టం చేసి బతుకుదామన్నా వయసు లేదు. మూడేళ్లపాటు తిరుపతిలోనే అడుక్కుని బతికానని, ఎన్నో కష్టాలు పడి ఇక్కడికొస్తే తన భర్త మరణించడంతో నేనెందుకు బతకాలి అని వెంకటలక్ష్మి ఏడుస్తున్నది. తక్షణమే వెంకటలక్ష్మిని ప్రభుత్వం తరుపున ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
పాపం ఈ పేద వృద్ధ జంట మీద భద్రాద్రి రామయ్య కరుణ కూడా లేకపోయిందే అని గ్రామస్తులు నిట్టూర్చారు. తిరుపతి వెంకన్న దర్శనం చేసుకోవాలన్న వారి కోరిక తీరింది కానీ… కోరి కష్టాలు తెచ్చుకుని ఆ జంట గూడు చెదిరిపోయిందని అందరూ ఆవేదన వ్యక్తం చేశారు.
మరో వాదన కూడా వినబడుతోంది
2015లో వెంకటలక్ష్మిని కావాలనే తిరుమలలో వదిలేసి వచ్చినట్లు మరో వాదన కూడా వినబడుతోంది. ఆమె మానసిక స్థితి సరిగా లేదని, అందుకే ఆమెను తిరుపతి తీసుకెళ్లి రాములు కావాలనే అక్కడ వదిలేసి వచ్చాడని గ్రామస్తులు అంటున్నారు. పదేళ్ల క్రితం గుంటూరు నుంచి చర్లకు వలస వచ్చారని, వారికి పిల్లలు లేరని చెబుతున్నారు. ఆమె మానసిక స్థితి సరిగా ఉండి నిజంగానే తప్పిపోతే సొంతూరికి రావడానికి ఇంత సమయం పట్టే చాన్స్ లేదు కదా అని గ్రామస్తులు అంటున్నారు. కమ్యూనికేషన్ విప్లవం సాధించిన ఈరోజుల్లో ఆమె తప్పిపోయి ఉంటే సొంతూరికి రావడానికి నాలుగేళ్లు పట్టదు కదా అని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే నాలుగేళ్ల తర్వాత తన స్వగ్రామానికి వచ్చిన ఆమె సరిగా ఏ వివరాలు కూడా వెల్లడించలేకపోతున్నట్లు చెబుతున్నారు.
ఏది ఏమైనా ఆమెను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.