అమ్మా గూగుల్ మాతా… ఆ జడ్జి గారి కులం ఏమిటమ్మా ?

(బాల రవితేజ నాయుడు)

తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ తెలంగాణ స్వరాష్ట్రం. అది సాకారమైంది. కానీ ఇంతకాలం న్యాయవ్యవస్థ వేరు పడలేదు. తెలంగాణ న్యాయవాదుల ఆందోళన, తెలంగాణ సర్కారు వత్తిడి ఫలించి న్యాయ వ్యవస్థలో విభజన జరిగిపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు. ఆయన నియామకం జరిగి 24 గంటలు గడవకముందే ఆయన గురించిన ఒక రహస్యాన్ని కనిపెట్టేందుకు నెటిజన్లు ఎంతగా ఆరాటపడ్డారో తెలిస్తే షాక్ అవుతాం. ఆయన కులం ఏంటో కనిపెట్టేందుకు తెలుగువారు, దేశ ప్రజలే కాదు విదేశాల్లో ఉంటున్న ఎన్నారైలు కూడా గూగుల్ తల్లిని అడిగారంటే ఆశ్చర్యం కలగకమానదు.

కులం పునాదుల మీద దేనిని సాధించ లేము, ఒక జాతిని ఒక నీతిని నిర్మించలేము అని అన్న అంబేద్కర్ మాటలు ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు. భారతదేశంలో కులం వేర్లు ఏ మేరకు పాతుకుపోయాయి అనేది స్వాతంత్రం వచ్చిన నాటి నుండి మనం ఎన్నో సందర్భాల్లో చూశాం, విన్నాము. అయితే దేశంలోని అన్ని వ్యవస్థలు కుల జాడ్యం లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ కులానికి న్యాయ వ్యవస్థ కూడా మినహాయింపు కాదు అని తాజా ఘటనతో అర్థమవుతుంది.

క్రిమినల్ లాయర్ పద్మనాభరెడ్డి కొడుకే ప్రవీణ్

పూర్తి వివరాల్లోకి వెళితే ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన నాటి నుంచి ఉమ్మడి హైకోర్టు రెండు రాష్ట్రాలకు సేవలు అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం లో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులను ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వడం తో, కేంద్ర ప్రభుత్వం 2 రోజుల క్రితం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ హైకోర్టు కు 16 మంది న్యాయమూర్తులను కేటాయించింది.

అయితే గురువారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు కేటాయించిన న్యాయమూర్తులలో అత్యంత సీనియర్ అయిన జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమించింది. ఈమేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ వ్యక్తి మరెవరో కాదు 60 ఏళ్ల పాటు నీతి, నిజాయితీలతో- విలువలకు కట్టుబడి సుదీర్ఘంగా న్యాయవాద వృత్తిని కొనసాగించిన క్రిమినల్ లాయర్ పద్మనాభ రెడ్డి కుమారుడు.

ఎన్నారైలు కూడా పోటీ పడి సెర్చ్ చేశారు

అంత గొప్ప క్రిమినల్ లాయర్ కుమారుడైన ప్రవీణ్ కుమార్ చీఫ్ జస్టిస్ గా నియమించగా నే ఇంటర్నెట్ వేదికగా కులం  పురివిప్పి నాట్యమాడింది. ‘‘అమ్మా గూగుల్ మాతా… ఆ జడ్జిగారి కులమేందమ్మా’’ అని లక్షలాది మంది నెటిజన్లు కులం కోసం క్లిక్ అనిపించారు. ఆయనది ఏ కులం అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఒకరు కాదు ఇద్దరు కాదు  కేవలం నిన్న ఒక్క రోజులో 15 లక్షల మంది ప్రవీణ్ కుమార్ కులం కోసం గూగుల్ లో సెర్చ్ చేసారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. 

అంటే మన భారతావనిలో కులం మహమ్మారి ఎలా నరనరాల్లో ఇంకిపోయి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు 15 లక్షల మందిలో దాదాపు 5 లక్షల మంది అమెరికా, యూరప్, లండన్ లాంటి దేశాల నుండి గూగుల్లో సెర్చ్ చేశారని గణాంకాలు చెబుతున్నాయి. గొప్ప గొప్ప చదువులు చదువుకొని విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న ప్రవాస భారతీయులు కూడా కుల పిచ్చితో కునారిల్లిపోతున్నారంటే ఏమనాలి? ఉన్నత స్థానాల్లో ఉన్న ఎన్నారైలు కూడా కులం గురించి ఇంతలా ప్రాకులాడడం చూస్తుంటే అంబేద్కర్ కలలుగన్న దేశాన్ని మనం చూడగలమా అని అనిపిస్తుంది.