ప్రముఖ పారిశ్రామిక వేత్త, వాన్ పిక్ కేసులో నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్ సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. సెర్బియా నిర్బంధం నుంచి విడుదలైన ఆయన హైదరాబాద్ చేరుకున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తాను క్వారంటైన్లో ఉన్నానని, అది పూర్తై బయటకు వచ్చిన తర్వాత తన పాస్‌పోర్టును సరెండర్ చేస్తానని కోర్టుకు తెలిపారు. అలాగే 2009లో తనపై నమోదైన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను పరిశీలించాలని కూడా నిమ్మగడ్డ కోరినట్టు తెలిసింది.
వాన్‌పిక్ వ్యవహారంలో నిమ్మగడ్డ ప్రసాద్‌పై రస్ అల్ ఖైమా సెర్బియా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో గతేడాది సెర్బియాలో ఉన్న నిమ్మగడ్డను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. నిమ్మగడ్డ అరెస్ట్ చెల్లదంటూ సెర్బియా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంతో ఆయన విడుదలై హైదరాబాద్ చేరుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం ఆయనను క్వారెంటైన్‌కు తరలించారు.
నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియాలో అరెస్టైన తర్వాత ఆయనను అక్కడి నుండి రప్పించేందుకు వైకాపా పార్టీకి చెందిన ఎంపీలు గట్టి ప్రయత్నాలు చేశారని టాక్ వచ్చింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కోరారని, జగన్‌కు అత్యంత సన్నిహితుడు కాబట్టే విదేశాంగ మంత్రికి లేఖ కూడా రాశారని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు కూడా చేసిన అంశాలు తెలిసినవే.