ప్రజల మెప్పు కోసం  ఉద్యోగులను ఏడిపిస్తారా ?

 
కరోనా మహమ్మారి నేపథ్యంలో  లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం  ఆర్ధిక ఇబ్బందులలో ఉండొచ్చు.  అంతమాత్రాన  రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు  వేతనాల్లో కోత విధించడం ఏమిటి ? కోట్లు ఉన్న రాజకీయ నాయకులు  ప్రభుత్వ సొమ్మును లక్షలకు లక్షలు విచ్చలవిడిగా ఖర్చు చెయ్యొచ్చు..  ఉద్యోగులు మాత్రం పూర్తి జీతం తీసుకోకూడదా ?  3 నెలలుగా వారి వేతనాల్లో కోత.  ఉద్యోగులలో నిరసన ఇప్పటికే ఎక్కువైంది.  అయినా తెలంగాణ ధనిక రాష్ట్రమని  తెలంగాణ ప్రభుత్వంలోని నాయకులే పలుమార్లు సెలవిచ్చిన సంగతి వాళ్లకు గుర్తు ఉందో లేదో ? నిజానికి ఆంధ్రతో పోల్చుకుంటే తెలంగాణ ప్రభుత్వానికి ఆర్ధిక లోటుపాట్లు చాల తక్కువ. మరి నెలవారీ జీతగాళ్ల వేతనాల్లో ఎలా కోత పెడతారని సామాన్యుల కూడా ప్రశ్నించే పరిస్థితి వచ్చింది.  సగం జీతమే వస్తుంది కాబట్టి, తమ విధిని ప్రభుత్వ ఉద్యోగులు సక్రమంగా నిర్వర్తిస్తారా ? సగం జీతానికి మొత్తం పని ఏమిటి అని వాళ్ళు పని చేయకపోతే  నష్టపోయేది ప్రజలేగా ?
 
ఇప్పటికీ ఉద్యోగుల హక్కులను ప్రభుత్వం హరిస్తుందనే నిజాన్ని కాదనగలమా ?  దేశంలోనే ఆర్థిక పరిపుష్ఠి గల తెలంగాణలో కరోనా సాకుతో వేతనాల్లో కోతలు విధించడం సరికాదని కేసీఆర్ తెలియంది కాదు, కాకపోతే వేతనాల్లోని నిధులు కూడా సంక్షేమం బాట పడుతున్నాయి అని ప్రస్తుత పరిస్థితులు చూస్తే అర్ధమవుతుంది.  కానీ  ప్రజల మెప్పు కోసం  ఉద్యోగులను ఏడిపించడం వారి జీతాలు కోయడం బాగాలేదు. ఉద్యోగుల కుటుంబాల జీవనం కష్టంగా మారిందని కూడా కేసీఆర్ గుర్తిస్తే మంచింది.  పైగా పెన్షనర్ల వేతనాల్లో  కూడా కోత విధించడం అనేది అతి బాధాకరం. పెన్షనర్లకు కచ్చితంగా తీవ్ర మనోవేదనే.  ప్రజల్లో తన గొప్పలు మెప్పు  కోసం కేసీఆర్‌ ఉద్యోగులను బాధ పెట్టడం న్యాయమా ?  ఒకపక్క  పక్క రాష్ర్టాల్లో ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లిస్తూ ఉంటే ఇక్కడ సీఎం నియంతలా వ్యవహరిస్తూ కోతలు విధించడం ఏంటని రేపు  ప్రభుత్వం పై  ఉద్యోగుల్లో తిరుగుబాటు వస్తే  ? అయినా వారి వేతనాల్లో కోత సరైన పద్ధతి అని తెరాస నాయకులు గుండెల మీద చేయి వేసుకొని దైర్యంగా చెప్పగలరా ? 
 
వైద్య ఖర్చులు సరిపోక విశ్రాంత ఉద్యోగులు ఇప్పటికే నానా ఇబ్బందులు పడుతూ  సోషల్ మీడియాలో తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మరి వారి ఆవేదనను కేసీఆర్ ప్రభుత్వానికి వినిపించేది ఎవరు ? ప్రజల సమస్యల పై  ప్రశ్నించే హక్కు తెలంగాణలో ఉందా అని అనుమానం కలుగుతుంది. లేకపోతే ఉద్యోగుల సగం జీతం కష్టాలనే అంశం  ఈ పాటికే హైలైట్ అయి ప్రభుత్వం దిగి వచ్చేది. ఏమైనా ఇప్పటికైనా  ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించాలి, అది కేసీఆర్ ప్రభుత్వానికే మంచింది.