తెలంగాణ మహా కూటమి రాజ్ భవన్ లో పురుడు పోసుకుందా ?

తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు ఏకమైతున్నాయి. మహా కూటమి దిశగా ప్రతిపక్ష పార్టీలు జట్టు కట్టబోతున్నాయి. ఈ మహాకూటమి రాజ్ భవన్ లోనే పురుడుపోసుకుందంటే నమ్ముతారా? కానీ ఇది ముమ్మాటికీ నిజం. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లోనే తెలంగాణ మహా కూటమికి అంకురార్పణ జరిగింది. వివరాలు చదవండి.

తెలంగాణలో విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో భాగంగా బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం తెలంగాణ కాంగ్రెస్, టిడిపి, జన సమితి, సిపిఐ నేతలు రాజ్ భవన్ లో బుధవారం గవర్నర్ నర్సింహ్మన్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉక్కు కార్మాగారం ఏర్పాటుకు వేగంగా చర్యలు తీసుకోవాలని గరవ్నర్ ను కోరారు. అంతేకాకుండా రాష్ర్ట సమస్యలపై నర్సింహ్మన్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టిడిపి అధినేత ఎల్. రమణ, తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ కు వినతిపత్రం సమర్పించిన తర్వాత వారు మీడియాతో మాట్లాడారు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. మళ్లీ 2019 లో అధికారం చేజిక్కించుకునేందుకు ఒంటరిగానే ప్రయత్నం చేయాలని టిఆర్ఎస్ ప్లాన్ చేసుకుంటున్నది. దీనికోసం వర్గాల వారీగా ఆకట్టుకునేందుకు టిఆర్ఎస్ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే రైతు బంధు లాంటి ఎన్నికల పథకాలకు కేసిఆర్ తెర తీశారు. మరోవైపు ముందస్తు ఎన్నికలకు పోవాలన్న ఉద్దేశంలో కూడా కేసిఆర్ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు కోరుకున్న పాలన సాగడంలేదని, కుటుంబ పాలన సాగుతోందని విపక్ష పార్టీలన్నీ గగ్గోలు పెడుతున్నాయి. ఒక్క కేసిఆర్ ఫ్యామిలీలోనే ఐదుగురికి పదవులు ఇచ్చుకున్నారని ఆ పార్టీలు విమర్శిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో.. కుటుంబ పాలనకు చరమగీతం పాడేందుకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలన్న ఉద్దేశంతో అడుగులు వేస్తున్నాయి. తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీని పక్కన పెడితే ప్రతిపక్షంలో ఉన్న బిజెపి ఈసారి ఒంటరిగానే పోటీ చేసే అవకాశముంది. ఇక మిగిలిన పార్టీల్లో సిపిఎం పార్టీ ఇప్పటికే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పేరుతో కుల సంఘాలు, పలు రాజకీయ పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేసుకుంది. ఆ కూటమి ద్వారానే సిపిఎం పోటీ చేసే చాన్స్ ఉంది. ఇక అత్యంత కీలకమైన కాంగ్రెస్, టిడిపి, తెలంగాణ జన సమితి, సిపిఐ పార్టీలు ప్రస్తుతం మహా కూటమి దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ నాలుగు పార్టీల ప్రధాన ఎజెండా కేసిఆర్ కుటుంబాన్ని గద్దె దించడమే కావడంతో మహా కూటమి ఏర్పాటుకు ఒక్కో అడుగు పడుతున్నది.

 

ఈ పరిస్థితుల్లో బయ్యారం ఉక్కు కార్మాగారం ఏర్పాటు పేరుతో ఈ నాలుగు పార్టీలు ఏకమై గవర్నర్ ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఉక్కు కార్మాగారం విషయంలోనే గవర్నర్ ను కలిసినా.. ఇతరత్రా విషయాలను కూడా ఈ సందర్భంగా వారు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. మహా కూటమి గా అవతరించాలనుకుంటున్న ఈ పార్టీలు ఇటీవలకాలంలో ఒక్క దగ్గరకు వచ్చిన దాఖలాలు లేవు. రాజ్ భవన్ లోనే వీరి కలయిక జరిగింది. దీంతో రాజ్ భవన్ వేదికగానే తెలంగాణ లో మహా కూటమి ఆవిర్భావం కాబోతుందన్న సంకేతాలు ఇచ్చారు ఈ నాలుగు పార్టీల నేతలు. కూటమికి ఇది తొలి కలయికగా భావిస్తున్నారు ఈ పార్టీల నేతలు.

నిన్నటి వరకు కాంగ్రెస్, టిడిపికి మధ్య వైరం ఉంది. తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ టిడిపికి బద్ధ శత్రువు కాంగ్రెస్ అన్నట్లుగా పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఆంధ్రాలో కాంగ్రెస్ సున్నా కు చేరింది. దీంతో రానున్న ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని కాపాడుకోవాలంటే తెలంగాణలో అధికారంలోకి రావాలి.. ఆంధ్రాలో గౌరవమైన సీట్లు సాధించాలి. అందుకోసమే ఆ పార్టీ పొత్తులకు తెర తీసినట్లు చెబుతున్నారు. ఆంధ్రా, తెలంగాణలో బిజెపి ఓటమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు రానున్న రోజుల్లో పొత్తులు పెట్టుకునే పరిణామాలు కనడబడుతున్నాయి. ఇక ఆంధ్రాలో అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణలో టిడిపి దిక్కుతోచని స్థితిలో ఉంది. పార్టీకి అంతో ఇంతో కేడర్ ఉన్నా లీడర్లంతా అటు టిఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ వైపు వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో టిడిపి గౌరవాన్ని కాపాడుకునేందుకు ఈ పార్టీకి కూడా పొత్తు అనివార్యం అయింది.

ఇక ప్రత్యామ్నాయ రాజకీయాలు చేయాలన్న సంకల్పంతో తెలంగాణలో రూపుదిదదుకున్నది తెలంగాణ జన సమితి పార్టీ. ఈ పార్టీ అధినేత కోదండరాం పొత్తులు అవసరం లేదన్నట్లే పైకి చెబుతున్నారు. తాము ఒంటరిగానే పోటీ చేస్తామని చెబుతున్నారు. కానీ ఆచరణలో మాత్రం పొత్తులు పెట్టుకుంటేనే కేసిఆర్ కుటుంబాన్ని గద్దె దించగలం అన్న ఉద్దేశంతో ఉన్నారు. తెలంగాణ రాకముందు కోదండరాం అందంగా కనబడ్డట్లు చెప్పిన టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చి అధికారంలోకి రాగానే కోదండరాం ఓకర వచ్చేలా ఉన్నాడంటూ చెప్పుకొచ్చింది. కోదండరాంపై కేసిఆర్ వ్యక్తిగత దూషణలకు దిగారు. వాడు, వీడు అంటూ ఒక మెట్టు దిగి సంబోధించారు. దీంతో తెలంగాణ జన సమితి శ్రేణులు కేసిఆర్ అహంకారానికి గుణపాఠం చెప్పాలని ఉవ్విళ్లూరుతున్నాయి. మహా కూటమి ద్వారానే తమ లక్ష్యం సాధిస్తామన్న ఉద్దేశంలో ఉన్నాయి. పార్టీ ప్రకటించిన తర్వాత కోదండరాం పార్టీలోకి పెద్దగా వలసలు వస్తాయని ప్రచారం సాగింది. కానీ ఆచరణలో వలసలేం రాలేదు. ఈ పరిస్థితుల్లో మహా కూటమిగా ముందుకు సాగడం తప్ప జన సమితికి మరో గత్యంతరం లేదు. ఇక సిపిఐ కూడా మరీ అధ్వాన్న పరిస్థితుల్లోకి నెట్టబడ్డది. ఆ పార్టీకి ఉన్న ఒక్క దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ టిఆర్ఎస్ లో చేరిపోయారు. ఈ పరిస్థితుల్లో పార్టీని నిలబెట్టుకునేందుకు కూటమి ఆవశ్యకత ఏర్పడింది.

మొత్తానికి రాజ్ భవన్ లో ఈ నాలుగు పార్టీల మధ్య స్నేహం చిగురించింది. మరి రానున్న 2019 ఎన్నికలను కలిసికట్టుగా ఎదుర్కొంటాయా? లేదా అన్నది త్వరలోనే తేలిపోనుంది.

రాజ్ భనవ్ వద్ద ఆల్ పార్టీ నేతలు ఏం మాట్లాడారో కింద వీడియో చూడండి.